సీట్లు తేల్చుకోకుండా భేటీలతో లాభమేంటి?

Sunday, December 22, 2024

ఇం.డి.యా. కూటమిలోని పార్టీలన్నీ ముచ్చటగా మూడోసారి ముంబాయిలో సమావేశం కాబోతున్నాయి. బెంగుళూరులో సమావేశం అయినప్పుడు.. 26గా ఉన్న కూటమిలోని పార్టీల సంఖ్య ఇప్పుడు 28కి పెరిగింది. ముంబాయి సమావేశాలకు 28 పార్టీలనుంచి 63 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించారు. సోనియా, రాహుల్ సహా అన్ని పార్టీల కీలక నాయకులు ఉంటారు. కూటమి కన్వీనర్ ఎవరో నిర్ణయించడం నుంచి.. మోడీ సర్కారును గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై అనేక కీలక చర్చలు ముంబాయిలో జరిగే అవకాశం ఉంది.

అయితే సీట్ల సర్దుబాటు సంగతి తేల్చుకోకుండా.. ఉత్తినే ఊరూపేరూ సింగిల్ సీటూ కూడా లేని పార్టీలను కూటమిలో కలుపుకుంటూ.. తమ బలం పెరుగుతోందని గప్పాలు కొట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఇం.డి.యా. లో ఉన్న కూటమి పార్టీలకు మధ్య విడివిడిగా రాష్ట్రాల్లో విబేదాలు ఉన్నాయి. వాటిని అధిగమించి వారు సీట్ల సర్దుబాటు ఎలా చేసుకోగలరో ముందు తేల్చుకోవాలి.

ఉదాహరణకు.. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ పార్టీకి.. కాంగ్రెసు, వామపక్షాలకు ఉప్పూ నిప్పూ అనదగ్గ వైరం ఉంది. వామపక్షాలతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ రాష్ట్రంలో నిత్యం లడాయి జరుగుతూనే ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఆరెండు పార్టీలకు తమ రాష్ట్రంలో సీట్లు పంచిపెట్టి.. ఆ పార్టీ లవారిని గెలిపించాల్సిందిగా కోరుతూ మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించడం అనేది కామెడీగా ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలకు మాత్రమే ఇం.డి.యా. కూటమి పరిమితం అనుకున్నప్పటికీ.. మళ్లీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి.. ఇప్పుడు నిర్వహించిన ప్రచారం నెగటివ్ ఎఫెక్ట్ మమతా దీదీ అవకాశాలపై పడుతుంది.

ఇదే తరహా పరిస్థితి ఢిల్లీలో ఆప్- కాంగ్రెస్ మధ్య కూడా ఉంది. ఆ రాష్ట్రంలో ఒకప్పుడు వైభవంగా వెలిగిన కాంగ్రెస్, ఆప్ తర్వాత కునారిల్లి పోయింది. ఇప్పుడు కూటమి ముసుగులో పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడం మాత్రమే కాకుండా.. ఢిల్లీ అసెంబ్లీ సీట్ల మీద కూడా కాంగ్రెస్ కన్నేస్తే.. కూటమి లక్ష్యం సాధించే విషయంలో మొదటికే మోసం వస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో.. ముందుగా సీట్ల సర్దుబాటు, త్యాగం చేయాల్సి వస్తే అందుకు పూనిక వహించేది ఎవరు అనేది తేల్చుకోకుండా.. ఈ కూటమి ఎన్ని సమావేశాలు నిర్వహించినా లాభం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.==

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles