సీఐడీ- వైసీపీ తొత్తు అనడానికి ఇదొక్కటీ చాలదా?

Sunday, November 17, 2024

విదేశాలలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అనేది చాలా పెద్ద నేరంగా పరిగణనలో ఉంటుంది. ఏదో రోడ్డు మీద నడిచి వెళుతున్న వారిని, హోటల్ లో కూర్చుని భోం చేస్తున్న వారిని యథాలాపంగా ఒక ఫోటో తీసి పత్రికల్లో ప్రచురించేస్తే.. ఆ ఒక్క ఫోటోతో సదరు పత్రిక ఖర్మ కాలిపోవచ్చు కూడా! తన అనుమతి లేకుండా, తన ఫోటో ప్రచురించినందుకు ఆ వ్యక్తి కోర్టులో దావా వేస్తే అది చాలా పెద్ద నేరం అవుతుంది. మనదేశంలో కూడా ఇందుకు అనుగుణమైన చట్టాలు ఉన్నాయి గానీ, నిజానికి అంత సీరియస్ గా పట్టించుకునే వారు లేరు. అంతకు మించిన శోచనీయమైన విషయం ఏంటంటే.. ఇక్కడ దర్యాప్తు సంస్థలు కూడా విచారణలో భాగంగా తీసే ప్రెవేటు ఫోటోలను బయటకు లీక్ చేసి అనుచితంగా, నీచంగా వ్యవహరిస్తుంటాయి. తాజాగా రామోజీరావు విచారణ విషయంలో ఏపీ సీఐడీ ఇదే దిగాజరుడు పని చేసింది. తమ సంస్థ.. సాక్షి టీవీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తు అని చాలా స్పష్టంగా నిరూపించుకుంది.
మార్గదర్శి చిట్ ఫండ్ పై విచారణ సాగిస్తున్న సీఐడీ అధికారులు, సంస్థ ఛైర్మన్ రామోజీరావును కూడా విచారించడానికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం ఇవ్వడానికి రామోజీరావు సోమవారం టైం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన కొడుకు కిరణ్ ఇంటికి వచ్చి విచారించారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న రామోజీరావును మధ్యలో కొంత వైద్య పరిచర్యలకు వ్యవధి ఇచ్చి ఏకంగా అయిదు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా ఫోటోలను బయటకు లీక్ చేయడం ఇప్పుడు అతి పెద్ద వివాదంగా మారుతోంది. సీఐడీ అనుచిత ప్రవర్తనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తైనాతీగా వ్యవహరించే వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది.
విచారణ నిమిత్తం ఇంటికి రాగానే.. సీఐడీ సిబ్బంది, ఆ సమయానికి బెడ్ పై చికిత్స తీసుకుంటున్న రామోజీరావు ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోకు అభ్యంతరపెట్టబోతే.. విచారణలో భాగం అంటూ చెప్పారు. వెంటనే ఆ ఫోటో సాక్షి టీవీలో ప్రసారం అయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోని సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటో వైరల్ అయింది. విచారణ కోసం అంటూ రామోజీరావు బెడ్‌పై ఉండగా తీసిన ఫోటో బయటకు ఎలా వెళ్లిందని, మార్గదర్శి సిబ్బంది ప్రశ్నిస్తే సీఐడీ సిబ్బంది సమాధానం చెప్పలేదు.
విచారణలో భాగంగా ఫోటోలు, వీడియోలు తీయవచ్చు గానీ.. వాటిని విచారణకు మాత్రమే వాడుకోవాలి. బయటకు పంపడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అవుతుంది. సీఐడీ ఈ విషయంలో రామోజీరావు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం మాత్రమే కాదు, ఈ రకమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ.. తాము వైఎస్సార్ కాంగ్రెస్ ఏజంట్ల లాగా పనిచేస్తామని కూడా నిరూపించుకున్నట్లు అయింది. ఈ ఫోటో సాక్షి టీవీకి, సోషల్ మీడియాలోకి వెళ్లడంపై మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ, రామోజీ రావు తరఫున సీఐడీపై కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. సీఐడీ ఈ వ్యవహారంలో ఎంత మేర ఇరుక్కుంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles