పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సుస్టాండును తాజాగా ప్రారంభించారు. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో కనీసం బస్సుస్టాండు కూడా కట్టలేదని సోషల్ మీడియాలో జగన్ చూశారట. అందుకని తండ్రి మీద విమర్శ చెరగిపోయేలాగా.. ఏకంగా 22 కోట్ల వ్యయంతో అక్కడ బస్సాస్టాండు కట్టించారు. ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే.. పులివెందుల సభలో జగన్ ప్రసంగం జనం నవ్వుకునేలా సాగిపోయింది. జగన్ ప్రసంగంలో చెబుతున్న అబద్ధాలు మరీ కామెడీగా కనిపిస్తున్నాయని జనం నవ్వుకుంటున్నారు.
కొన్ని ఉదాహరణలు గమనిద్దాం..
జగన్ ప్రసంగం : అప్పుడూ ఇప్పుడూ అదే బడ్జెట్. అయితే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అప్పుడు (తెలుగుదేశం) ఎందుకివ్వలేదు
జనం మనోగతం : అప్పుడు వాళ్లు రాష్ట్రం కోసం ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారు. ఇప్పుడు తమరు ఉన్న డబ్బంతా.. జనం జేబుల్లోకి ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చినట్టుగా పంచిపెట్టేస్తే చాలు.. అదే సంక్షేమం అని భ్రమ పెడుతున్నారు.
జగన్ ప్రసంగం : తెదేపా ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేస్తున్నాం.
జనం మనోగతం : అవును దేశమంతా అదే అనుకుంటున్నారు. పార్లమెంటు సాక్షిగా ఆర్థికమంత్రి వెల్లడించిన గణాంక వివరాలతోనే ఆ సంగతి అందరికీ అర్థమవుతోంది.
మూడువారాలు గడచిపోతున్నా కూడా.. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంలోనే ఆ సంగతి ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది.
జగన్ ప్రసంగం : సీఎం మారడంతోటే (చంద్రబాబు పోయి, జగన్ వచ్చాక) రైతులు వృద్ధులు మహిళలు చిన్నారుల తలరాతలు మారుతున్నాయి.
జనం మనోగతం : తలరాతలు మారుతున్నది నిజం పైకి వెళ్తున్నాయా కిందికి వెళ్తున్నాయా తెలీడం లేదు. యువతరం తలరాత మాత్రం పాతాళానికి వెళ్లింది. పరిశ్రమలు రాక ఉన్నవి వెళ్లిపోతున్నందువల్ల.
జగన్ ప్రసంగం : వైసీపీకి ఓటు వేయని వారికి కూడా అర్హులుంటే పథకాలు అందిస్తున్నాం.
జనం మనోగతం : ఈ మాట ప్రత్యేకంగా చెప్పడంలోనే మీ ఆలోచన సరళి అర్థమవుతోంది. ఏ ప్రభుత్వమైనా ఆ పనే చేయాలి. చేస్తుంది. అనర్హులు ముసుగులో తొలగిస్తున్న వారంతా ఏ పార్టీ వారో లెక్కతీస్తే ఇంకా బాగా అర్థమవుతుంది.
జగన్ ప్రసంగం :నా పాలనలో ఎక్కడా లంచాలు లేవు.
జనం మనోగతం : ఆ సంగతి ప్రతి నెలా మొదటి వారంలో ఇంటిదగ్గరే పింఛన్లు పుచ్చుకుంటున్నవారికి చేతిలో ఎంత పడుతోందో.. వాలంటీర్ల జేబులోకి ఎంత వెళుతోందో గమనించిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.
సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఆరాధన భావం ఎక్కువ. అక్కడి సభలో జగన్ ఏం చెప్పినా నమ్ముతారు. అన్యధా భావించారు. కానీ ఆయన ప్రసంగాన్ని గమనించిన ఇతర ప్రాంతాల ప్రజలు ఇలా అనుకుంటున్నారు.