ఎవరో చెప్పారని.. ఒక వ్యక్తిని దొడ్డిదారిలో తెచ్చి అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత.. నియామకం విషయంలో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించింది. కానీ.. ప్రభుత్వానికి మాత్రం పరువు పోతోంది. ఆశ్రితులు, నిరాశ్రయులు, వందిమాగధులు అందరికీ ప్రభుత్వంలో ‘సలహాదారు’ అనే పదవిని కట్టబెట్టేసి.. నెలవారీగా లక్షలకు లక్షలు దోచిపెడుతున్న ఏపీ సర్కారు తీరుపై తాజాగా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.
సలహాదారుల నియామకం విషయంలో జగన్ ప్రభుత్వం చాలా చాలా ఉదారంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లెక్కకు మిక్కిలిగా ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు. యావత్తు ప్రభుత్వాన్ని నడిపించే సలహాదారులు కొందరైతే.. అసలు ఏ పనీలేకుండా కూర్చునే సలహాదారులు బోలెడంత మంది! ఇలాంటి నేపథ్యంలో జ్వాలారపు శ్రీకాంత్ అనే వ్యక్తిని జగన్ సర్కారు దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమించింది. మంత్రులకు సలహాదారులు అంటే ఓకే గానీ.. సీనియర్ ఐఏఎస్ అధికారులు సారథ్యం వహించే శాఖలకు సలహాదారులేమిటి అని అప్పట్లోనే విమర్శలు వినిపించాయి. అయితే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సిఫారసు మేరకు జ్వాలారపు శ్రీకాంత్ ను నెలకు 1.6 లక్షల రూపాయల వేతనంతో దొడ్డిదారిలో నియమించినట్లు కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ తరహా నియామకంపై గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, నియామకపు జీవోపై స్టే ఇచ్చింది. అయితే పిటిషనర్ కు శ్రీకాంత్ తో గతంలో వ్యక్తిగత వివాదం ఉన్నందువల్ల ఈ పిటిషన్ ఉద్దేశ్యాలు వేరని వాదనలు వినిపించడంతో ప్రస్తుతానికి స్టే ఎత్తేస్తున్నట్టు, తుదితీర్పు వచ్చేదాకా పదవిలో ఉండవచ్చునని హైకోర్టు చెప్పింది. ఈ రకంగా జ్వాలారపు శ్రీకాంత్ కు ఊరట లభించింది గానీ.. ఈ పిటిషన్ వాదోపవాదల రూపేణా.. ప్రభుత్వానికి మాత్రం పరువు పోయింది.
సలహాదారుల నియామకపు తీరుతెన్నులను కోర్టు తీవ్రంగా తప్పుపట్టడం విశేషం. సీనియర్ అధికారులు నిర్వహించే శాఖలకు కూడా సలహాదారులు అంటే ముందుముందు తహశీల్దార్లకు కూడా సలహాదార్లు వస్తారేమోనని ఎద్దేవా చేసింది.
జగన్ సర్కారు వివిధ రంగాల నుంచి తమకు ఆశ్రితులు అందరికీ ఎడాపెడా సలహాదారు పదవులను కట్టబెట్టేస్తూ వస్తోంది. ఈ నియామకాలు ప్రతిసారీ వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఖాతరు చేయడమే లేదు. అసలు సలహాదారు పదవి ఇస్తున్నారే తప్ప.. తమ సలహాలు తీసుకునే వాళ్లెవ్వరూ లేరని ఆగ్రహించి.. ఈ పదవిని వదలిపోయిన సలహాదారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్ రూపంలో ప్రభుత్వం చేస్తున్న అనుచిత పందేరం గురించి ప్రజల్లో మరోసారి చర్చ జరుగుతోంది.
సలహాదారు హేపీనే.. ప్రభుత్వానికే పరువు నష్టం!
Tuesday, November 26, 2024