గత ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను కొత్త ప్రభుత్వాలు సహించకపోవడం, వాటిని మార్చడం, తొలగించడం చాలా సాధారణమైన సంగతి. ప్రజలకు మేలుచేసేవైతే పేర్లు మార్చుకుంటారు.. అంతే తప్ప తొలగించడంద్వారా ప్రజలకు ద్రోహం జరిగిందనే అపకీర్తిని మూటగట్టుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. తీసుకున్న దూకుడైన నిర్ణయాల్లో ఒకటి అన్న క్యాంటీన్లను పూర్తిగా తొలగించడం. ఆకలితో అలమటించే పేదవాడికి అయిదు రూపాయలకు కడుపు నిండా అన్నం పెట్టే ఈ వ్యవస్థను తొలగించడం అనేది అప్పట్లోనే సర్వత్రా విమర్శలకు గురైంది. అయినా సరే జగన్ సర్కారు పట్టించుకోలేదు.
పేదల సంక్షేమం కోసం ఎన్నెన్నో పథకాలు తెచ్చాం అని చెప్పుకునే సర్కారు.. రోడ్లమీద కూలీల, పేదల, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తొలగించడం అనేక విమర్శలకు గురైంది. కావలిస్తే పథకానికి పేరు మార్చుకుని వైఎస్సార్ క్యాంటీన్ అని పేరు పెట్టుకున్నా మంచిదే గానీ.. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలని కోరుకున్న వారి విన్నపాలకు దిక్కు లేకుండాపోయింది. పైగా, అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాల్ని కూలగొట్టడం, వాటిని వార్డు సచివాలయాలుగా మార్చి రూపురేఖలు మొత్తం ఛిద్రం చేయడం వంటి అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చాన్నాళ్లుగా పేదల కడుపు నింపే దిశగా.. సర్కారు చేసిన ద్రోహాన్ని తెలుగుతమ్ముళ్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత డబ్బు ఖర్చు చేసి అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయి.పార్టీ వాళ్లు తమ సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నా కూడా.. వైసీపీ దళాలు ఓర్చుకోవడం లేదు. చాలా చోట్ల అన్న క్యాంటీన్ల మీద దాడులు చేయడం, ధ్వంసం చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.
బొబ్బిలిలో అన్న క్యాంటీన్ కోసం కట్టిన భవనం నిరుపయోగంగానే ఉంది. దీనిని తమకు లీజుకు ఇస్తే సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడతాం అని తెలుగుదేశం నాయకులు మునిసిపల్ కమిషనర్ ను లిఖితపూర్వకంగా కోరారు. వాళ్ల సొంత స్థలాల్లో పెట్టిన వాటినే.. వైసీపీ నాయకులు ధ్వంసం చేస్తున్న రాష్ట్రంలో.. ఈ భవనాన్ని మునిసిపాలిటీ తరఫున లీజుకు ఇస్తే ఇంకేమైనా ఉందా? అందుకే కమిషనర్ కిమ్మనలేదు. తామైతే పేదలకు అన్నం పెట్టదలచుకున్నాం గనుక.. ఆ భవనం రాకపోతే మాత్రం ఏమైందని.. రోడ్డుమీదనే అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు తెదేపా నాయకులు. ప్రతిరోజూ 300 మంది మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. రోడ్డు మీదనే పెడుతున్నప్పటికీ వసతులు లేకపోయినా.. కాలువల పక్కన కూర్చుని అయినా పేదలు భోజనం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో.. అన్న క్యాంటీన్ల విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరి మరోసారి ప్రజల్లో చర్చకు వస్తోంది.
సర్కారు ద్రోహాన్ని సరిదిద్దుతున్న తెలుగు తమ్ముళ్లు!
Thursday, November 14, 2024