ప్రభుత్వం తమ ముఖచిత్రం మార్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటిదాకా ఉన్న రెడ్డి ముఖచిత్రాన్ని మార్చుకుని ‘బీసీ ప్రియ’ ముఖచిత్రాన్ని తగిలించుకోవాలని అనుకుంటోంది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు బీసీ బాంధవ ప్రభుత్వంగా కనిపించడానికి కసరత్తు చేస్తోంది. ఏ రీతిగా నైనా బుజ్జగించుకోగల, నచ్చజెప్పుకోగల, అధికార పదవులను మించి యితరేతర లబ్ధిని చూపించగల అయినవాళ్లు, సొంత మనుషుల మీద వేటు వేయడం ద్వారానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ‘ముఖచిత్ర మార్పిడి’కి శ్రీకారం చుట్టనున్నారు.
జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. కీలక నామినేటెడ్ పదవులు అన్నీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి.సర్కారు ఆ విమర్శలను ఎన్నడూ పట్టించుకున్నది కూడా లేదు. తాము చేయదలచుకున్నది చేసుకుంటూపోతూనే ఉంది. అయితే బీసీలకు సర్కారు ద్రోహం చేస్తున్నదనే వాదన ఇటీవలి కాలంలో ఊపందుకుంది. ప్రతిపక్షాలు ఆ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగాయి. కాస్త అలర్ట్ అయిన సర్కారు బీసీలకోసం ఓ సభను కూడా నిర్వహించింది. అయినా నిర్ణయాల్లో కనిపించకుండా కేవలం మాటల్లో నమ్మించడం సాధ్యం కాదని కూడా వాళ్లు తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న కొందరు రెడ్లను తప్పించి, ఇతర సామాజిక వర్గాలకు ప్రధానంగా బీసీలకు కట్టబెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
జగన్ బాబాయి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ని ఆ పదవినుంచి తప్పించడం ద్వారానే ఈ కసరత్తుకు శ్రీకారం చుడతారని ప్రచారం ఉంది. వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రను చాలా ప్రతిష్ఠాత్మకంగా, కీలకంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన బాధ్యత కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రెండు పడవల మీద యాత్ర సాగిస్తున్నారు. పార్టీ బాధ్యతల మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరించేలా టీటీడీ పదవినుంచి తప్పిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవిని బీసీనేతకు అప్పగించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే.. ఇటీవల చంద్రబాబు విజయనగరంలో పర్యటిస్తూ టీటీడీ బోర్డులో ఒక్క ఉత్తరాంధ్ర వ్యక్తినైనా నియమించారా? ఈ ప్రాంతంలో జగన్ కు అర్హులు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఆ దిశగా విమర్శను బాపుకోవడానికి ఆ ప్రాంతం నుంచి ఒకరిద్దరికి చాన్స్ దక్కవచ్చునని కూడా తెలుస్తోంది. టీటీడీతో మొదలై.. ఇతర అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా ఇప్పుడు ఉన్న రెడ్లను ఈ ఏడాదిలో తప్పించి.. బీసీలకు ఇవ్వాలనే ది సర్కారు యోచన. ఎన్నికలకు రెండు నెలలు ముందుగా.. ప్రచారం బరిలోకి దిగే సమయానికి నామినేటెడ్ పోస్టులన్నీ గరిష్టంగా బీసీలతో, వెనుకబడిన వారితో నిండిఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అవకాశవాద ప్రేమ వ్యూహాలు ఎలా పనిచేస్తాయో మరి!
సర్కారువారి ముఖచిత్రం మారబోతోంది!
Friday, November 22, 2024