ఈనెల 12న వివేకానంద విజయంతి. దేశవ్యాప్తంగా యువజన దినోత్సవం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై యువతరంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని, నిరసన ధ్వనులను వినిపించడానికి ఈసారి కొత్త వ్యూహం సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని రణస్థలంలో యువశక్తి పేరిట బీభత్సమైన స్థాయిలో ఒక యూత్ ఫెస్టివల్ నిర్వహించడానికి జనసేన నిర్ణయించింది. ఇది కేవలం యూత్ ఫెస్టివల్ గా మాత్రమే కాకుండా, అందులో ఒక బహిరంగ సభ కూడా కలిసిపోయిన ఫార్మేట్ లో సరికొత్తగా ఉంటుంది! ఉత్తరాంధ్ర యువకులే ప్రభుత్వం మీద తమ సమరశంఖం పూరించేలా ఉంటుంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ కు యువతరంలో బీభత్సమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం జనసేన పార్టీకి చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర పార్టీల్లోని యువతరం కూడా పవన్ కళ్యాణ్ ను విపరీతంగా ఆరాధిస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువతరం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని అనుకోవడమే గొప్ప సంగతి. పైగా ఆ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడం ఒక వ్యూహంగా పలువురు భావిస్తున్నారు.
రాజధాని వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఉత్తరాంధ్ర ఎదుగుదల సాధ్యమవుతుందని లేకపోతే ఉత్తరాంధ్రకు నష్టం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి చెందిన అమాయక ప్రజలను ఒక భయవిహ్వల, దుర్బల వాతావరణంలోకి నెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ప్రజలకు నిజాలు తెలియజెప్పే లక్ష్యంతో, చైతన్యం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఒకరోజు పొడవునా నిర్వహించే ఈ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాలకు యువశక్తి అని పేరు పెట్టారు.
సాహిత్యం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు అనేకం యూత్ ఫెస్టివల్ లో భాగంగా ఉంటాయని సమాచారం. అలాగే ఓ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ఈ బహిరంగ సభ వేదిక మీద సుమారు వందమంది యువసేన నాయకులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటో యువతరానికి ఎలాంటి ద్రోహం జరుగుతున్నదో అనే విషయాల్ని వారితోనే మాట్లాడిస్తారు. బహిరంగ సభ ఏర్పాటు చేయడం ప్రభుత్వాన్ని నిందిస్తూ తాను మాట్లాడడం.. యువకులు వినడం లాగా కాకుండా యువకులు మాట్లాడితే తతిమ్మా మొత్తం ప్రపంచం వినేలాగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రూపకల్పన చేయడం విశేషం.
విశాఖ రాజధాని వ్యతిరేకించే వాళ్ళందరూ ఉత్తరాంధ్ర ద్రోహులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అదే ఉత్తరాంధ్ర నుంచి జనసేన నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం విజయవంతం అయితే గనుక వైసీపీ దుర్మార్గ ప్రచారాలకు దీటైన కౌంటర్ ఇచ్చినట్లే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.