వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. సొంత పార్టీ ప్రభుత్వం మీద నిరసన గళం వినిపించడానికి కూడా ఆయన వెనుకాడరు. అధికారులు పనిచేయకపోతే.. బురదగుంటలో దిగి.. వారిని కూడా దించి.. అది బాగుచేయాల్సిందే అని చెప్పగలరు. చెలరేగిపోతే.. మీడియా ప్రతినిధులమీద బండబూతులతో ముందువెనుక చూసుకోకుండా విరుచుకుపడగలరు. పోలీసుల మీద నువ్వెంతంటే నువ్వెంతని రెచ్చిపోగలరు. అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ ప్రభుత్వం మీదనే రెచ్చిపోయారు.
ప్రధానంగా ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ మీద తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ.. ఆయన మాటల్లో ప్రభుత్వం చేతగానితనం, వైఫల్యాలు, కేటాయింపులు జరుగుతున్నట్లుగా పేరుకు జీవోలు వస్తున్నప్పటికీ.. పనులకు జరగకపోవడం వంటి వ్యవహారాలు అన్నీ బయటకు వస్తున్నాయి.
పోయిన ఏడాది ఆగస్టులో మసీదు నిర్మాణానికి 15 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జీవో ఇస్తే దానికి ఇప్పటిదాకా అతీగతీ లేదని కోటంరెడ్డి అన్నారు. ఆర్థిక అనుమతి రాలేదని వాపోయారు. నెల్లూరు రోడ్ల రిపేర్ల గురించి బొత్సను అడిగితే.. పోయిన ఏడాదిలో డిసెంబరుకు పూర్తి చేయిస్తానన్నారని.. ఆయన శాఖ మారిపోయారు గానీ.. ఇంకో డిసెంబరు వచ్చినా ఇప్పటికీ రోడ్లు అలాగే ఉన్నాయని ఆగ్రహించారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ వద్దకెళ్తే కనీసం కూర్చోమని చెప్పలేదని, తాను కుర్చీలో కూర్చున్నాక పట్టించుకోకుండా కంప్యూటరు చూస్తూ కూర్చున్నారని.. సమస్య విన్నవిస్తే కనీసం సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు. రావత్ కు ఎమ్మెల్యేలంటే లెక్కలేదని కోటంరెడ్డి అంటున్నారు గానీ.. సీఎం సంతకం పెట్టిన జీవోలకు కూడా ఆర్థిక అనుమతులు ఇవ్వకపోవడం అంటే.. రావత్ కు ముఖ్యమంత్రి అంటే కూడా లెక్కలేదని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
ముఖ్యమంత్రి అనుమతించిన పనులకు కూడా అధికారులు సహకరించడం లేదని వాపోవడం విశేషం. పనుల కోసం పది రూపాయలు అడిగితే అర్ధరూపాయి ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. రూపాయి పనులు చేసిన వారికి కనీసం పదిపైసలు చెల్లించినా.. ఇంకో పని చేయడానికి ముందుకు వస్తారు. చెల్లింపులు లేకపోవడంతో.. పనులే జరగడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విమర్శలన్నీ కూడా.. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలోనే వెల్లడించడం విశేషం. సమస్యలు తీరకపోతే ఉద్యమంతప్ప వేరే దారిలేదని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నారు. సాధారణంగా తన పాలన పట్ల ధిక్కారస్వరం సహించలేని సీఎం జగన్, సొంత ఎమ్మెల్యే కోటంరెడ్డి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
సర్కారీ వైఫల్యాలు కడిగిపారేసిన సొంత ఎమ్మెల్యే!
Thursday, December 19, 2024