సర్కారీ వైఫల్యాలను రచ్చకీడుస్తున్న జగనన్న స్టిక్కర్లు!

Thursday, November 21, 2024

ఇంటింటికీ తలుపులకు స్టిక్కర్లు అంటిస్తే.. తద్వారా తమ ఓటు బ్యాంకు ఎలా డెవలప్ అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో అర్థం కాని సంగతి. ఎందుకంటే.. జగన్ అంటే ప్రేమ ఉన్నవారు ఆయన ఇవ్వకపోయినా సరే.. ఆయన బొమ్మను స్టిక్కరుగా తమ ఫోన్ల మీద వాహనాల మీద వేసుకుని తిరుగుతూ ఉంటారు. అభిమానం హద్దులు దాటితే టాటూలు కూడా వేయించుకుంటారు. అయితే.. ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం కదా అని.. బలవంతంగా తామే స్టిక్కర్లు ఇంటింటికీ అంటిస్తాం అంటే అది చవకబారుగా ఉంటుంది.
అయితే పాపం ప్రభుత్వం స్టిక్కర్లు అంటించడానికి చాలా పద్ధతిగా నియమాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వాలంటీరు లబ్ధిదారులకు వివరించిన తర్వాత, వారి అనుమతితో మాత్రమే వారి తలుపుకు స్టిక్కరు అంటించాలని చెప్పింది. అంటించిన సదరు స్టిక్కరు ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయమని కూడా చెప్పింది. అయితే చెప్పింది చెప్పినట్టుగా వాలంటీర్లు ఎందుకు వింటారు. లబ్ధిదారుల్ని బెదిరించి అయినా సరే.. స్టిక్కర్లు అంటించేస్తారు.
కానీ ఈ యవ్వారం చాలా చోట్ల బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. స్టిక్కర్ల పుణ్యమాని ఇదివరకు లేని కొత్త తలనొప్పులు బయటపడుతున్నాయి. సర్కారీ వైఫల్యాలు కొత్తగా తెరమీదకు వస్తున్నాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇదేజరిగింది. దాసరి రవి అనే వ్యక్తి కి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరి పేర్లను రేషన్ కార్డులోకి ఎక్కించాలని సంవత్సరాలనుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వారు పట్టించుకోవడంలేదు. ఇటీవల నానా కష్టాలు పడి ఒక పాప పేరు ఎక్కించాడు. ఇంకో చిన్న పాప పేరు రేషన్ కార్డులో నమోదు చేయలేదు. ఇంత చిన్న పని కోసం అతడిని సిబ్బంది ఇంతగా వేధిస్తుండగా, వాలంటీరు వెళ్లి అతను లేని సమయంలో ఇంటి తలుపుకు స్టిక్కరు అంటించేసి వెళ్లిపోయారు.
దాసరి రవికి ఒళ్లు మండింది. అంటించిన స్టిక్కరును పీకి చేతిలో పట్టుకుని.. వచ్చి సచివాలయం ముందు ధర్నాకు పెళ్లాంబిడ్డల సహా కూర్చున్నాడు. మా పనులు చేయకుండా, మాకేమీ పథకాలు ఇవ్వకుండానే మా ఇళ్లకు స్టిక్కర్లు వేస్తారా? అంటూ నిలదీశాడు. ఇంత చిన్న పనికి కూడా పేదలను తిప్పించుకుంటూ.. వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటించడంలో మాత్రం ముందువరుసలో ఉండాలని అనుకుంటే.. ఇదే తరహాలో వివాదాలు ముదిరి ప్రభుత్వం అభాసు పాలయ్యే ప్రమాదం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles