విశాఖలోని రుషికొండను ధ్వంసం చేసే విషయంలో.. నాలుగేళ్లుగా కొనసాగిస్తున్న తమ విధ్వంసాత్మక పాలనను మరింత ఘాటుగా కొనసాగించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించేసింది. రుషికొండలో ఏకంగా 61 ఎకరాల మేర నిర్మాణాలు చేపట్టడానికి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చేసింది. అసలు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల విషయంలోనే బోలెడన్ని వివాదాలు కొనసాగుతూ ఉండగా.. ప్రతిపక్షాలు మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ పోరాటవేత్తలు గగ్గోలు పెడుతుండగా,కోర్టు ఆంక్షలు విధిస్తుండగా అవేమీ ఖాతరు లేదన్నట్టుగా ప్రభుత్వం తాను చేయదలచుకున్నది చేసుకుంటూ పోతున్నది. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని వ్యతిరేకిస్తున్న వారిని ఈసడిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం గద్దె ఎక్కిన నాటినుంచి విశాఖపట్నంలో రుషి కొండను ధ్వంసం చేసి చేపడుతున్న నిర్మాణాలపై ఎంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. రుషి కొండను మొత్తం తవ్వేసి .. అక్కడ టూరిజం ప్రాజెక్టు కడుతున్నాం అని మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. అసలే వివాదం నడుస్తోంటే.. ఇప్పుడు కొండను దాదాపుగా మాయం చేసేలాగా కొ్త్త నిర్మాణాలకు అనుమతులివ్వడం విశేషం.
జీవీఎంసీకి పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు గాను, 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని టూరిజం ఇంజనీర్లు పేర్కొన్నారు. దీనిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టుకు వెళ్లాక ప్రభుత్వం మాట మార్చింది. పర్యావరణ, సీఆర్జడ్ అనుమతులు పూర్తిగా ఉన్న 2.88 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు ఉంటాయని కోర్టుకు పేర్కొంది. న్యాయస్థానానికి చెప్పిన ప్రకారం అంత విస్తీర్ణంలోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాలు చేపట్డడానికి వీలుగా ప్లాన్ లను పూర్తిగా మార్చేశారు. ఆ మేరకు 69.64 ఎకరాల్లో ఏకంగా 61.03 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేలా ప్లాన్లు తయారుచేశారు. ఈ లెక్కన రుషి కొండను మొత్తం మాయం చేసేసినా ఆశ్చర్యం లేదని పర్యావరణ వేత్తలు ఆవేదన చెందుతున్నారు.
రుషికొండను ధ్వంసం చేసేసి పర్యావరణ ప్రాజెక్టులు కట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఇవి పర్యావరణ ప్రాజెక్టులు కాదని, సెక్రటేరియేట్ కోసం దొంగచాటు నిర్మాణాలు చేపడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. అనుమతులకు- నిర్మాణాలకు పొంతనలేకుండా సాగుతున్న విధ్వంసంపై పోరాటాలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యతిరేకతను ప్రభుత్వం పర్సనల్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. రుషికొండ విధ్వంసానికి పగబట్టినట్టుగా.. 2.88 ఎకరాల్లో చేయదలచుకున్న నిర్మణాలను ఏకంగా 61 ఎకరాలకు విస్తరించడం ద్వారా ఏం చేస్తారో చేసుకోండి అని విపక్షాలను ఎద్దేవా చేస్తున్నట్టుగా పరిస్థితి తయారవుతోంది. విశాఖ వాసుల్లో ఈ నిర్ణయం అసంతృప్తిని రాజేస్తోంది. సరిగ్గా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ జరగబోతున్న తరుణంలో స్థానికుల్లో ఆగ్రహావేశాలు రేగే ఈ నిర్ణయం వెలికిరావడం గమనార్హం.
సర్కారీ డైలాగ్ .. ‘ఏం చేస్తారో చేసుకోండి!’
Monday, December 23, 2024