ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక.. అధినేత తమ కష్టాలను ఆలకించాలని, ఆ కష్టాలను దూరం చేయాలని కోరుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేల బాధలు వినడానికి సుముఖంగా లేరు. వారి సమస్యలను పట్టించుకుని పరిష్కరించడానికి ఆయనకు ఖాళీ లేదు. ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఆయా జిల్లాలకు ఉండే ఇన్చార్జి మంత్రులు చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనం చేసేశారు. తాను మాత్రం బిందాస్ గా తాడేపల్లి ప్యాలెస్ కదలకుండా రాజకీయం నడిపిస్తానని సంకేతాలు ఇచ్చారు. దీని పర్యవసానంగా ఎమ్మెల్యేలకు తమ తమ నియోజకవర్గాలలో ముఠా కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు ఉన్నట్లయితే వాటిని అధినాయకుడు దృష్టికి తీసుకెళ్తామనుకోవడం భ్రమ.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి ఫిరాయించి వైసిపి జెండా మోస్తున్న వారు అదనం. ఫిరాయించి వచ్చిన వారి నియోజకవర్గాలలో అక్కడి పాత వైసిపి నాయకులతో బోలెడు తగాదాలు ఉంటున్నాయి. అది కాకుండా వైసిపికి ఉన్న సీట్లలో దాదాపు సగం చోట్ల రెండు అంతకు మించిన గ్రూపులు పార్టీకి సమస్యగా పరిణమిస్తున్నాయి. అలాగని అధినేత దృష్టికి తీసుకెళ్లడానికి వారికి అవకాశం కూడా దొరకడం లేదు.
అధికార పార్టీలోనే రెండు గ్రూపులకు చెందిన వారు రోడ్డున పడి కలబడి కొట్టుకున్న సందర్భాలు కూడా అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండగా.. ఈ విభేదాలను ఎక్కడికక్కడ సద్దుమణిగేలా చేసి పార్టీని ప్రజల ముందు బలంగా నిలబెట్టవలసిన బాధ్యత అధినేతకు ఉంటుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యేల సమస్యల గురించి దృష్టి సారించినట్లుగా మనకు అనిపించదు. రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల కష్టాలు, బాలినేని మామయ్యకు వచ్చిన ఇబ్బందులను తప్ప జగన్ స్వయంగా పట్టించుకున్న వ్యవహారాలు లేవు. ఈ అసంతృప్తి పార్టీ ఎమ్మెల్యేలలో చాలామందికి ఉంది. ఎన్నికలలోగా జగన్ స్వయంగా జోక్యం చేసుకుని నియోజకవర్గాల్లో తమకు ఉన్న సమస్యలను తీరుస్తారు కదా అని వారు ఎదురుచూస్తున్నారు.
కానీ తాజాగా క్యాబినెట్ భేటీ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తాను ముందు ముందు కూడా ఎమ్మెల్యేల కష్టాలు పట్టించుకోవడం కుదరదని చెప్పేశారు. ఆయా ఇన్చార్జి మంత్రులు మాత్రమే సమస్యలను తీర్చాలని జగన్ చెప్పడం చాలామందికి మింగుడు పడడం లేదు. ఇలాంటి నిర్వహణ తీరు కచ్చితంగా పార్టీకి చేటు చేస్తుందని సీనియర్ నాయకులు అంటున్నారు.
సమస్యలన్నీ మీ వంతు.. మంత్రులకు తేల్చిచెప్పిన జగన్!
Wednesday, December 18, 2024