సజ్జల మాటల్లో గురివింద నీతి!

Wednesday, January 22, 2025

గురివింద గింజ తన వెనుక ఉన్న నలుపు ఎరగదని సామెత. తన నలుపు చూసుకోకుండా మిగిలిన అన్ని గురివింద గింజల వెనుక ఉన్న నలుపు చూసి గేలిగా నవ్వుతుందని దీని భావం. ఇప్పుడు ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న మాటలు గమనిస్తే.. అచ్చంగా ఈ గురివింద నీతి గుర్తుకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతున్న తీరు గమనించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంగారు పుడుతున్నదని, ఆ కంగారులోనే అర్థంపర్థంలేని విమర్శలతో వారు తమ పరువును తామే తీసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. తెలుగుదేశం- బిజెపి మధ్య పొత్తుల గురించి మళ్లీ ప్రచారం మొదలైంది. కేవలం నడ్డాతో భేటీ మాత్రమే కాకుండా, ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బిజెపికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కేవలం ప్రత్యేకహోదా డిమాండ్ కోసం మాత్రమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, పొత్తులు మళ్లీ కుదిరే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని చంద్రబాబునాయుడు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ కల్యాణ్ చాలా కాలంగా భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్న తరుణంలో.. మూడు పార్టీల పొత్తు 2014 తరహాలోనే ఏర్పడుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ పోకడలను వైసీపీ జీర్ణం చేసుకోలేకపోతోంది. వారు కలిస్తే తమకు ముప్పు తప్పదనే భయం పాలక పక్షంలో ఏర్పడుతోంది. అందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. పొత్తుల గురించి గేలిచేస్తున్నారు. ఆయన మాటల్లో కీలకమైనవి ఏంటంటే.. ‘‘నడ్డాతో చంద్రబాబు వంగివంగి, నంగి నంగి మాట్లాడారు. తద్వారా ఏపీ పరువు తీస్తున్నారు.’’ అని అన్నారు. రెండు సోఫాల్లో కూర్చున్న ఇద్దరు నాయకులు ఒకరి వైపు ఒకరు వంగి మాట్లాడడంలో ఆయనకు ఏం విచిత్రం, అతిశయం కనిపించిందో తెలియదు. వంగి మాట్లాడడం వల్లనే ఏపీ పరువు పోయిందని అంటున్న సజ్జల, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీ ఎదురుగా కనిపిస్తే చాలు.. తక్షణం పాదాల మీద వాలిపోయి ఆశీస్సులు పుచ్చుకోవడానికి ప్రతిసారీ ఎగబడుతూనే ఉంటారే.. ! ఆ వైఖరిని ఎలా వర్ణిస్తారు! జగన్ మోడీకి సాగిలపడడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే దానిని సర్వనాశనం చేసేశారు. ఈ సాష్టాంగ ప్రణామాలతో పరువు తీయడం మాత్రమే కాదు, హోదా విషయంలో ప్రజలను వంచించి, అభివృద్ధిని కూడా దూరం చేశారనేది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు సజ్జల చంద్రబాబు వంగి మాట్లాడడాన్ని తప్పు పడుతున్నారు.

బిజెపి సారథ్యం స్వీకరించిన తర్వాత.. వైసీపీ నాయకులకు లొంగకుండా.. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న, వారి లోపాలను ఎత్తిచూపుతున్న పురందేశ్వరిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ఏజెంటుగా అభివర్ణించడం విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles