అవకాశం వస్తే రెండు తెలుగురాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని, ఆంద్రప్రదేశ్ ఉమ్మడిగానే ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని.. ఏపీలోని ప్రభుత్వ సలహాదారు స్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.తెలుగురాష్ట్రాలు తిరిగి ఉమ్మడిగా ఉండేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా.. దానికి అనుకూలంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఓటు వేస్తుందని సజ్జల సెలవిచ్చారు.
ఏపీ విభజన అసంబంద్ధంగా రిగిందని, ఆ చట్టం చెల్లదని ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు ఉన్నదని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తాం అని సజ్జల చెప్పుకొచ్చారు. విభజన జరిగిన తీరుమీదనే కేసు ఉన్నదన్నారు.
సజ్జల ఏదో వేరే ఎజెండాను మనసులో ఉంచుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఉమ్మడిగా ఉండడాన్నే కోరుకుంటుందనే వాదనను ఇప్పుడు తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది.
అయితే సజ్జల మాటలు అనేక రకాల విమర్శలకు గురవుతున్నాయి. విభజనను వ్యతిరేకిస్తున్నందుకు తెలంగాణ వాదులు విమర్శించడం ఒక ఎత్తు.. కానీ, ఈ మాటలపై ఏపీలో కూడా విమర్శలు రేగుతున్నాయి. ‘ సుప్రీం కోర్టులో ఉన్న కేసు విషయంలో మేం పోరాడతాం’ అని సజ్జల చెప్పడంలో అర్థం ఏమిటి? అనేది ప్రజలకు సందేహం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందా? ఏపీ ప్రభుత్వం పోరాడుతుందా? అనేది తెలియదు. అయితే విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత.. సజ్జల ఈ సమైక్యగానం ఆలపించడం ఏమిటో అర్థం కాని సంగతి. ఇప్పటిదాకా సుప్రీం కేసు విషయంలో వైసీపీ కూడా పోరాడుతున్నట్టుగానీ, ఏపీ సర్కారు పోరాడుతున్నట్టుగానీ ఎక్కడా వార్తల్లోకి రాలేదు. కేసు వేసిన వారు వేరు.. పోరాడుతున్న వారు వేరు. అయితే హఠాత్తుగా ఇప్పుడు సజ్జల తెరమీదకు వచ్చి.. ఏమో సుప్రీం కోర్టు విభజన చట్టాన్ని కొట్టేయవచ్చు.. అని సన్నాయి నొక్కులు నొక్కడం కామెడీ గా అనిపిస్తుంది.
విభజన తర్వాత ఏపీ అనాథలాగా ఏర్పడింది. ఎంతో జాగ్రత్తగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. రెండోదఫా అయినా జగన్ చేతికి అధికారం వచ్చింది. దానిని వాడుకుని.. అనాథలాంటి ఏపీకి ఆయన ఏరకంగా మంచి చేస్తున్నారు.. అనేది వారు ఆలోచిస్తున్నట్టు లేదు. పరిశ్రమలు తీసుకురావడం, ఉపాధి అవకాశాలు పెంచడం, తద్వారా రాష్ట్రప్రభుత్వ ఆదాయం పెంచడం ఇవేవీ వారికి పట్టడం లేదు. తాము పాలిస్తున్న తీరుకు సింగిల్ ఆంధ్రప్రదేశ్ చాలదన్నట్టుగా.. తెలంగాణను కూడా కలుపుకోవాలని ఆయన కోరికను వ్యక్తం చేయడమే తమాషా.
దక్కిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎలాగో చేతకాని ప్రభుత్వం తరఫున.. రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే బాగుండేది అనే డైలాగులు వల్లించడం చూసేవారికి చాలీ లేకిగా కనిపిస్తుంది. మంచో చెడో రాష్ట్ర విభన జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి అవకాశాలను సృష్టించుకుంటూ కష్టపడాల్సింది బదులు.. వచ్చే అవకాశాల్ని కూడా నాశనం చేస్తూ.. తమ చేతగానితనం బయటపడకుండా.. రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే బాగుండేదనే చేతకాని మాటలు చెప్పడం బాగాలేదని పలువురు విమర్శిస్తున్నారు.