షర్మిల ప్రస్థానం సోదిలో లేకుండాపోయిందే!

Friday, November 15, 2024

అన్న మీద తిరుగుబాటు జెండా ఎగరవేసి.. తెలంగాణను ఏలుతానంటూ.. సొంత పార్టీని స్థాపించి.. ఆమె వేసిన తొలి అడుగులు.. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి ప్రకంపనాల్ని పుట్టించాయి. అడుగడుగునా ఏ అగ్రపార్టీలకు కూడా తీసిపోని విధంగా ఆమె దూకుడు ప్రదర్శించారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రస్తుత కీలక తరుణంలో ఆమె హఠాత్తుగా సోదిలో లేకుండాపోయారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. తెలంగాణ ముఖ్యమంత్రి అయి, ప్రజలకు సేవ చేస్తానని చేసిన ప్రతిజ్ఞలన్నీ ప్రగల్భాలుగా మిగిలిపోతున్నాయి. ఆమె ప్రస్థానం అవరోహణ క్రమంలో నానాటికి తీసికట్టుగా తయారైపోయింది.

వైఎస్ షర్మిల.. తన అన్న జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీకోసం తన శక్తియుక్తులన్నీ ఒడ్డి పనిచేశారు. ప్రధానంగా జగన్ జైలులో ఉన్న సమయంలో.. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ప్రజల ముందుకు వచ్చి ఆమె సాగించిన పర్యటనలే ఆ పార్టీని నిలబెట్టాయి. ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి విపరీతంగా శ్రమించారు. అయితే 2019 ఎన్నికల సమయానికి చెల్లెలుకు టికెట్ ఇవ్వకపోగా, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆమెకు రాజకీయంగా ఒక సముచిత స్థానం కల్పించడం గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇతరత్రా కూడా వారిమధ్య విభేదాలు వచ్చాయి.

ఏపీ రాజకీయాలను పూర్తిగా విడిచిపెట్టిన షర్మిల తెలంగాణలో తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆమె తల్లి విజయమ్మ కూడా కూతురు వెంటే ఉండిపోయారు. జగన్ నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు ఆమె గౌరవాధ్యక్షురాలు కాగా, ఆ పదవికి కూడా రాజీనామా చేసేశారు. షర్మిల తన ప్రస్థానంతో తెలంగాణలో దూకుడు ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబం మీద చాలా సూటిగా, వాడిగావేడిగా విమర్శలు సంధిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. మధ్య చిన్న చిన్న విరామాలతో సుదీర్ఘ పాదయాత్ర కూడా సాగించారు. పాదయాత్రలో అనేక వివాదాలు రేకెత్తితే చాలా దూకుడుగా వాటిని ఎదుర్కొన్నారు. అనేకమార్లు అరెస్టు అయ్యారు. కేసీఆర్ ఇంటిని ముట్టడించడానికి ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ దూసుకెళ్లిపోతే.. పోలీసులు అడ్డుకుని, కారు దిగనని మొరాయించినా ఆమెను కారుతో సహా ‘టో’ చేసి తీసుకెళ్లి అరెస్టు చేసిన సంఘటనలు కూడా జరిగాయి. తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించి తాను ముఖ్యమంత్రి అయి సేవలందిస్తానని పదేపదే చెప్పారు.

కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కర్ణాటక ఎన్నికల తర్వాత.. షర్మిల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోతున్నదనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. కేవలం దానికి సంబంధించినచర్చలకోసమే ఆమె ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలు చూసుకునేట్లయితే మాకు అభ్యంతరం లేదని తెలంగాణలో కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యంతర పెట్టారు. ‘రాక ఓకే, కానీ..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ పరిణామాల మధ్య.. ఆమె సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా మంటగలిసిపోయాయి. సరిగ్గా ఎన్నికలు వచ్చే సమయానికి షర్మిలగానీ, ఆమె పార్టీగానీ అస్సలు సోదిలో కనపడకుండా పోయాయి. కాంగ్రెసులో అభ్యర్థిత్వాలకు దరఖాస్తుల పర్వం కూడా అయిపోయింది. ఆమె కోరుకుంటున్న పాలేరు సీటును తుమ్మల నాగేశ్వరరావు తన్నుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. మాణిక్ రావు ఠాక్రే లాంటి వాళ్లు షర్మిల పార్టీ విలీనం సంగతి తనకు తెలియదని అంటున్నారు. ఇవన్నీ.. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని హఠాత్తుగా మరుగున పెట్టేసినట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles