షర్మిల కాలు పెడితే.. వాళ్ల పునరుజ్జీవం సాధ్యమే!

Saturday, November 16, 2024

వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయలను పూర్తిగా వదిలేశారు. తండ్రి జయంతి, వర్ధంతి లాంటి అరుదైన సందర్భాల్లో ఆయన సమాధి వద్ద నివాళి అర్పించడానికి తప్ప ఆమె ఏపీలో అడుగుకూడా పెట్టడం లేదు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం., వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి కేసీఆర్ కుటుంబాన్ని  తీవ్రంగా దూషిస్తూ చెలరేగిపోతున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, అంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఒకవైపు వాటిని ఖండిస్తున్నప్పటికీ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ తో రెండుసార్లు భేటీ కావడం, కెవిపి రామచంద్రరావు కూడా మంతనాలు సాగించారనే వార్తలు ఆమె చేరిక నిజమే కావచ్చుననే అభిప్రాయాలు కలిగిస్తున్నాయి. ఆమె తొలినుంచి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని అంటున్నారు. ఆమె కోరిక మేరకు ఆ సీటును కేటాయించడానికి కాంగ్రెసుకు అభ్యంతరం లేదని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదంతా నేపథ్యం కాగా, షర్మిల కాంగ్రెసులో చేరడం అంటూ జరిగితే, ఆమెను ఏపీ రాజకీయాల్లో కాంగ్రెసు వాడుకోకుండా ఉంటుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఆమెను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా అభివర్ణిస్తూ మాట్లాడారు. అయినా సరే, ఆమెకు తెలంగాణలో ఒక సీటు ఇవ్వడం వారికి ఇబ్బంది కాకపోవచ్చు. అలాగని తాను కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతానని, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడబోనని అంటే కాంగ్రెసుకు ఆమె వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. వైతెపాను కాంగ్రెసులో చేర్చుకోవడం వల్ల వారికి అదనపు లాభం ఏమీ ఉండదు.

తాను తెలంగాణలో పోటీచేసినప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో కూడా కాంగ్రెసుకోసం పనిచేస్తూ ప్రచారం నిర్వహిస్తూ ఉపయోగపడతానంటే మాత్రం కాంగ్రెసుకు లాభం జరుగుతుంది. ఏపీలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా శవాసనం వేసి ఉంది. ఆ పార్టీని కనీసం లేపి నిలబెట్టడానికి, పునరుజ్జీవింపజేయడానికి షర్మిల ఆగమనం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల షర్మిల పూర్తి వైరభావంతోనే ఉన్నారు. జగన్ గురించి మాట్లాడవలసి వచ్చిన ఒకటిరెండు సందర్భాల్లో ఆమె వ్యతిరేకతనే వ్యక్తం చేశారు. కనీసం జగన్ పుట్టినరోజుకు, రాఖీ పండుగనాడు ట్వీట్లు పెట్టడం కూడా ఆమె మానేశారు. అదే సమయంలో.. రాహుల్ గాంధీ పుట్టినరోజుకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇలాంటి నేపథ్యంలో.. షర్మిలను ఏపీ రాజకీయాల్లో జగన్ మీదికి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించడం కాంగ్రెస్ కు చాలా సులువు. వైఎస్సార్ కాంగ్రెస్ లో సగం మంది కాంగ్రెస్ పార్టీనుంచి వెళ్లిన వైఎస్సార్ అనుయాయులే ఉంటారు. వారిలో జగన్ మీద ఎంత ప్రేమ ఉంటుందో, షర్మిల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. ఇన్నేళ్లలో జగన్ వైఖరి పట్ల అసంతృప్తి రేగిన వారు ఎవరైనా ఉంటే.. షర్మిల సారథ్యం వహించే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడానికి కూడా మొగ్గు చూపుతారు. ప్రజలు కూడా వైఎస్సార్ తనయగానే షర్మిలను ఆదరిస్తారు. ఇన్ని కారణాల వలన.. కాంగ్రెస్ పార్టీకి తిరిగి అక్కడ జవజీవాలు దక్కుతాయి. అందుకనే.. ఏపీ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించాలనే కండిషన్ మీద.. షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ లో కలుపుకోవడానికి పార్టీ సిద్ధంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles