వైఎస్సార్ కుటుంబంతో ఖమ్మం జిల్లాకు చెందిన బహిష్కృత భారాస నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చిరకాలంగా సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం. అదే సమయంలో షర్మిల పార్టీ ప్రారంభించిన తర్వాత, గులాబీదళంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన తరువాత.. ఓసారి ఆమెను కలిసినది కూడా నిజం. ఆయన వైఎస్సార్ తనయుడు జగన్ ఆశీర్వాదంతోనే రాజకీయ అరంగేట్రం చేసి, తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన మాట కూడా నిజం. అయినంత మాత్రాన ఇప్పుడు ఆయన షర్మిల పార్టీలో చేరుతారనే గ్యారంటీ లేదు. పోటీకి ఎంత ఉబలాటం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అసెంబ్లీలోకి సీట్ల పరంగా బోణీ కొడుతుందో లేదో గ్యారంటీ లేని షర్మిల పార్టీ లోకి , రాజకీయ భవిష్యత్తు మీద చాలా ఆశలు పెంచుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరడం అనేది భ్రమ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
షర్మిల పాదయత్ర ద్వారా.. తెలంగాణను చుట్టబెట్టేస్తున్నారు. ఆమె పాదయాత్రకు.. అన్ని పాదయాత్రలకు మల్లేనే ప్రతిచోటా ఎంతో కొంత జనం వస్తున్నారు. ఆ జనాన్ని ఉద్దేశించి ఆమె ఎడాపెడా కేసీఆర్ని, ఆయన కుటుంబాన్ని నానా తిట్లు తిట్టి సంతోషపడుతున్నారు. అయితే షర్మిల పార్టీ అనేది సంస్థాగతంగా తెలంగాణలో బలోపేతం అవుతున్నదా అనేది మాత్రం డౌటే!
ఒకవైపు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవబోయేది తన పార్టీనే, సీఎం కాబోయేది తానే అని షర్మిల ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. పాపం.. కూతురు కోసం వైఎస్ విజయమ్మ.. ఏపీలో అధికారంలో ఉన్న కొడుకు పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న అత్యున్నత హోదాను కూడా కాలదన్ని వచ్చేశారు. అటువైపు కూడా తిరిగి చూడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో షర్మిల పార్టీ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. ఆమె అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాలు చేయడానికి జరిపిని ప్రయత్నం దారుణంగా బెడిసి కొట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ తరఫున మీడియా ముందు మాట్లాడే అలవాటున్న గట్టు రామచంద్రరావు.. పొంగులేటికి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నారు గానీ.. దాని ప్రభావం ఉంటుందా అనేది అనుమానం. కేసీఆర్ ను జడిపించి, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీలోకి వెళ్లాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచిస్తుండగా.. జూపల్లితో కలిసి అందుకు అనుగుణంగా రంగం సిద్ధం చేసుకుంటుండగా.. వైతెపా గేట్లు ఆయనకోసం తెరిచి ఉంటాయని అన్నంత మాత్రాన ఆయన ఎందుకు వస్తారనేది ప్రజల అనుమానం. ఎన్నికలు సమీపించే వేళకి.. షర్మిల పార్టీ సోదిలో ఉంటుందో లేదో కూడా తెలియదు. అలాంటి పార్టీ పొంగులేటి రాకకోసం ఆశపడడమే కామెడీగా ఉంది.
షర్మిల ఆకర్ష మంత్రానికి పొంగులేటి లొంగేనా?
Sunday, December 22, 2024