షర్మిలక్క విలీనాన్ని ధ్రువీకరించిన వైఎస్సార్ ఆత్మ!

Monday, December 23, 2024

తెలుగు రాజకీయాల్లో తన సొంత పేరు కంటె.. ‘వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ’ గా గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు, వ్యూహరచనా దురంధరుడు కేవీపీ రామచంద్రరావు ఓ సంచలన విషయం ప్రకటించారు. వైఎస్సార్ కూతురు, తెలంగాణరాజకీయాల్లో కేసీఆర్ మీద విమర్శల దాడి చేయడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఆయన వెల్లడించారు. చాలా కాలంగా.. షర్మిల కాంగ్రెస్ లో చేరిక గురించి.. ఊగిసలాటకు తెరపడినట్టే.

కెవిపి రామచంద్రరావు మీడియాతో  మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయబోతున్నట్లుగా తనకు సమాచారం ఉన్నదని, అలా జరిగితే ఆమె పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తామని ఆయన అన్నారు. ఆమె కాంగ్రెసులోకి వస్తే వైఎస్సార్ ఆత్మ శాంతిస్తుందని కూడా కేవీపీ చెప్పుకొచ్చారు. కాంగ్రెసుపార్టీ ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తే.. ఆ బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని కూడా కేవీవీ వ్యక్తం చేశారు.

సొంతంగా పార్టీ స్థాపించి తెలంగాణలో చాలా కాలంగా కేసీఆర్ పై పోరాటం చేస్తున్న షర్మిల నిజానికి ఇంకా ఒంటరిగానే ఉన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వామపక్షాలు, ఇతరులు కొందరితో పొత్తుబంధాలు పెట్టుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. ఖమ్మం జిల్లా పాలేరునుంచి తాను బరిలోకి దిగాలని కూడా నిర్ణయించుకున్న షర్మిల.. పార్టీని మాత్రం ఆశించినంత బలంగా తయారుచేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత.. పరిణామాలు వేగంగా మారాయి. అక్కడి పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ను షర్మిల రెండు మూడు సార్లుకలవడం, రాహుల్ పుట్టిన రోజు నాడు ప్రత్యేకంగా ట్వీట్ చేయడం వంటి పరిణామాలు.. ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అందుకు తగ్గట్టు కేవీపీ రామచంద్రరావు కూడా ఆమె కాంగ్రెసులో చేరడానికి మంతనాలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన స్వయంగా.. ఆమె పార్టీలోకి రాబోతున్న సంగతిని వెల్లడించారు. షర్మిల వైపు నుంచి బలంగా ఖండనలు కూడా రావడం లేదు. నేడో రేపో ఆమె కాంగ్రెసులో విలీనం కావడం అనేది తేలిపోనుంది.

కాంగ్రెసులో చేరిన తర్వాత.. షర్మిల కోరుకుంటున్నట్టుగా ఆమెను తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగేలా ప్రోత్సహిస్తారా? ఏపీ రాజకీయాల్లో పార్టీ పనులు చేయాల్సిందిగా.. క్లిష్టబాధ్యతలు అప్పగిస్తారా? అనేది వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles