నిబంధనలు అనేవి ఏమైనా ఉంటాయని, ఉంటే వాటిని తాము కూడా పాటించాలని బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు స్పృహ ఉండదేమో. నిబంధనలు సామాన్యుల కోసం ఉంటాయే తప్ప.. తమబోటి అధికార పార్టీ అసామాన్యులు వాటిని ఎలాగైనా ఉల్లంఘించవచ్చునని వారు బహుశా అనుకుంటూ ఉండవచ్చు. అందుకే ఎలాంటి రాజకీయ ప్రచారాలూ నిషిద్ధం అయిన తిరుమల దివ్యక్షేత్రంలో ‘నువ్వే మా నమ్మకం జగన్’ స్టిక్కర్లను అంటిస్తూ వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తిరుమలలో రాజకీయ పార్టీల ప్రచారం నిషేధం అనే సంగతి అందరికీ తెలుసు. అయితే సాక్షాత్తూ తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్ల వెనుక క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ, తిరుమలలో పలు సందర్భాల్లో అన్యమతప్రచారాలు జరుగుతూ ఉన్నాసరే.. మిన్నికుండిపోయే ప్రభుత్వాలకు ఇలాంటిది పడుతుందా అనేది ప్రశ్న.
జగనన్న సర్కారు ప్రస్తుతం నువ్వే మా నమ్మకం జగన్ పేరుతో రాష్ట్రవ్యాప్త ప్రచారానికి తెర తీసింది. లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీరును వెంటబెట్టి, పార్టీ కార్యకర్తలను పంపుతూ.. వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వారికి నొక్కి చెబుతోంది. ఈ ప్రయత్నంలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికీ కూడా ‘నువ్వే మా నమ్మకం జగన్’ అంటూ తన బొమ్మతో స్టిక్కర్లు అంటించేయాలనేది ఆయన కోరిక. లబ్ధిదారులైతే స్టిక్కర్లు వద్దనడానికి భయపడతారని ఆయన నమ్మకం. ఈ ప్రాసెస్ లో భాగంగా.. వైసీపీ కార్యకర్తలు తిరుమలలో ఇళ్లకు కూడా స్టిక్కర్లు అంటిచేయడం ప్రారంభించారు.
రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా నిషిద్ధం అయిన తిరుమల క్షేత్రంలో ఈ కార్యక్రమం ద్వారా.. వవైసీపీ జెండాలు పట్టుకుని తిరుగుతూ.. వైసీపీ స్టిక్కర్లను అంటిస్తూ వివాదానికి కారణం అయ్యారు. ఈలోగా సమాచారం అంది టీటీడీ విజిలెన్సు అధికారులు అక్కడకు వచ్చి వారిని వారించడంతో ఆ ప్రచారాన్ని ఆపేశారు. వైసీపీ నాయకుల తీరు చూస్తే.. తిరుమలలోని ఇళ్లకు మాత్రమే కాదు.. శ్రీనివాసుడు నివాసం ఉండే ఆలయ మహద్వారానికి కూడా ‘నువ్వే మా నమ్మకం జగన్’ స్టిక్కరు అంటించేసి ఆనందిస్తారని భక్తులు నవ్వుకుంటున్నారు.
శ్రీవారి మహద్వారానికి కూడా జగనన్న స్టిక్కర్ వేస్తారా?
Wednesday, January 22, 2025