శ్రీవాణి మీదనే ఎందుకంత స్పెషల్ ప్రేమ!?

Friday, January 10, 2025

తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే సంపన్న భక్తులకు వీఐపీ టిక్కెట్ లను అధికారికంగా అధిక ధరలకు విక్రయించే కొత్త విధానాన్ని వైవీ సుబ్బారెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీవాణి ట్రస్టుకు రూ.పదివేల విరాళం ఇచ్చినట్లయితే, వారికి వీఐపీ టికెట్ ను రూ.500కు అమ్ముతారు. అంటే, 10500 చెల్లిస్తే వీఐపీ దర్శనం దొరుకుతుందన్నమాట. ఈ శ్రీవాణి ట్రస్టుకు అందుతున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అసలు శ్రీవాణి కింద చెల్లించే మొత్తాలకు రసీదులు కూడా ఇవ్వడం లేదని విపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఆరోపణలు గుప్పించారు. సహజంగానే ప్రభుత్వంలోని వారందరూ వీటిని ఖండించడం ప్రారంభించారు. వైవీసుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన బోర్డు మీటింగ్ కూడా.. ఈ ఆరోపణలను ఖండించింది. శ్రీవాణి ట్రస్టు నిధులకు ఇప్పటికే దేశంలో 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని, గోశాలల నిర్వహణ, ఆలయాల ధూప దీప నైవేద్యాలకు వాడుతున్నాం అని, రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారెడ్డి ఖండించారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. సుబ్బారెడ్డి చెప్పిందే నిజం అనుకుందాం. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం కావడం లేదని, రసీదు లేకుండా టికెట్లు ఇచ్చే అవకాశమే లేదని అనుకుందాం.

అయితే ఒక్కడ మరికొన్ని కోణాలను గమనించాల్సి ఉంది. వైవీసుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు కేవలం శ్రీవాణి మీద మాత్రమే ఇంత అవ్యాజ ప్రేమానురాగాలు ఎందుకు చూపిస్తున్నది. ఒక భక్తుడు స్వామి వారి సత్వర, మంచి దర్శనం , వీఐపీ హోదాతో కోరుకుంటే వారికి 10వేల రూపాయల విరాళం ద్వారా విక్రయించడం వరకు ఓకే. ఇలాంటి నియంత్రణ మంచిదే. కానీ.. ఆ విరాళం శ్రీవాణి ట్రస్టుకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? అనేది ప్రశ్న. టీటీడీ ఆధ్వర్యంలో అనేక మంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. అన్నదాన ట్రస్టు ద్వారాజరిగే వితరణ అద్భుతం. అలాగే వైద్యసేవల పరంగా గానీ, విద్యా పరంగా గానీ, ధర్మ ప్రచారం పరంగా గానీ, అనేక రకాల మంచి కార్యక్రమాలు టీటీడీ  నిర్వహిస్తుంటుంది. ఒక భక్తుడికి ఆస్పత్రికే విరాళం ఇవ్వాలని అనిపించవచ్చు. అతడు ఆస్పత్రి కి లక్ష విరాళం ఇచ్చినా, అతడికి వీఐపీ దర్శనం దొరకదు. కానీ, శ్రీవాణికి పదివేలు ఇస్తే వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ వ్యత్యాసాలు ఎందుకనేది ప్రశ్న.

శ్రీవాణి ట్రస్టు ద్వారా.. నిధులను ఆలయాల రిపేర్లు, నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నదని, అందులో స్వాహా పర్వానికి అధికంగా అవకాశం ఉన్నదని అందుకే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారనేది పలువురి ఆరోపణ. అలాంటి ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలంటే.. టీటీడీ ఆధ్వర్యంలోని ఏ ట్రస్టుకు పదివేలు విరాళం ఇచ్చినా సరే.. 500కు వీఐపీ టికెట్ ఇచ్చే సంప్రదాయం తేవాలి. భగవంతుడికి ముడుతున్న సొమ్ము బోర్డు పెద్దలు, అధికారులు స్వాహా చేసేస్తున్నారని భక్తులకు  సందేహం రాకుండా చూసుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles