శుభం: ముఠా తగాదాలు కొలిక్కి వస్తున్నాయా?

Sunday, November 24, 2024

తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తమ జట్టులో కలుపుకోవాలని బిజెపి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. వారిద్దరినీ కాంగ్రెస్ ఆకర్షించగలిగింది. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫైనల్ అయింది. రాహుల్ సమక్షంలో ఖమ్మంలోనే జరగబోయే భారీ బహిరంగసభలోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదొక పెద్ద శుభపరిణామం అయితే.. దీనిని మించిన మంచి సంకేతాలు ఆ పార్టీకి కనిపిస్తున్నాయి. సాధారణంగానే గ్రూపు తగాదాలకు, ముఠాకక్షలకు పెట్టింది పేరు అయిన కాంగ్రెస్ పార్టీలో.. అవి ఒక్కొక్కటిగా సమసిపోతున్నాయా? అనే అభిప్రాయం ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి సారథ్యాన్ని తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆయనతో సయోద్యకు రావడం.. ఇద్దరు నాయకులు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని చెప్పడం ఇలాంటి శుభపరిణామాలకు శ్రీకారంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

పొంగులేటి పార్టీలో చేరడాన్ని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అయితే పొంగులేటి రాకకు నల్గొండ నాయకులకు సంబంధం లేనేలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. స్థానిక నాయకులను సంప్రదించకుండా, అందరి ఆమోదం లేకుండా పార్టీలో ఎవ్వరినీ చేర్చుకోబోయేది లేదని కూడా రేవంత్ తేల్చిచెప్పారు. నల్గొండ జిల్లాలో వేముల వీరేశం వంటి నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి కొంత వ్యతిరేకత స్థానిక కాంగ్రెసు పెద్దలనుంచి వస్తున్నదనే పుకార్లున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో సంప్రదించకుండా ఎవ్వరినీ చేర్చుకోబోం అని రేవంత తేల్చిచెప్పారు. ఈ రకంగా అందరు నాయకులతో సయోధ్య కుదుర్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నాలు పార్టీకి శుభసంకేతాలే.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తొలినుంచి ఉన్నాం అని, తాము సీనియర్లం అని అనుకునే వారు, ఆయనకు మింగుడుపడడం లేదు. ఇలాంటి నాయకుల్లో పీసీసీ చీఫ్ గా పార్టీ సారథ్యాన్ని బలంగా ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. కోమటిరెడ్డికి రేవంత్ కు మధ్య ప్రస్తుతం పూర్తిస్థాయిలో సామరస్యం కుదిరినట్టుగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో రేవంత్ ఒక మెట్టు దిగి అయినా సరే.. కాంగ్రెసులో గ్రూపులుంటాయనే ప్రచారానికి కారకులు అవుతున్న ఇతర నాయకులను అందరినీ దారిలోకి తెచ్చుకోవాల్సి ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే, ఒకరి మీద మరొకరు అధిష్ఠానానికి పితూరీలు చెప్పుకునే వాతావరణం లేకపోతే.. కాంగ్రెస్ కు మంచిరోజులు గ్యారంటీ అని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles