ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే తాము మూడు రాజధానుల సంకల్పం తీసుకున్నట్టు పదేపదే చెప్పడమే ఓ అందమైన అబద్ధం. అయితే ఇది అబద్ధం అనే సంగతిని, రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా విడమరిచి చెప్పిన వారు మాత్రం జగన్ మంత్రివర్గ సహచరులలోని అత్యంత సీనియర్ ధర్మాన ప్రసాదరావు. ఆయన విశాఖలో ఓ సందర్భంలో మాట్లాడుతూ మూడు రాజధానులు అనే మాటలు మొత్తం ట్రాష్ అని కొట్టి పారేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అని పేరు పెట్టినప్పటికీ కేవలం విశాఖ ఒక్కటే రాష్ట్రానికి రాజధాని అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతి, కర్నూలు నగరాల మొహం చూసే దిక్కు కూడా ఉండదని ఆయన విశ్లేషించారు. ధర్మాన ప్రసాదరావు మాటల ద్వారా ప్రభుత్వ ఆలోచనల్లోని అసలు సీక్రెట్ ప్రజలకు తెలిసిపోయింది. వారిని తిరిగి మభ్యపెట్టడానికి ధర్మాన మాటలు ద్వారా జరిగిన నష్టాన్ని పోల్చుకోవడానికి పార్టీ అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది.
ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మరోసారి అదే తరహాలో తన మాటల ద్వారా పార్టీ ఆలోచనల్లోని రహస్యాన్ని బయటపెడుతున్నారు. గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మనవాళ్లంటూ పంపిన పిల్లలను మాత్రమే వాలంటీర్లు గాని నియమించామనే రహస్యాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు. వాలంటీర్లు అందరూ వైకాపా కార్యకర్తలేనని సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసే ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం లోపాయికారీగా పని చేస్తున్నారని విపక్షాలు పదేపదే ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ధర్మాన చెబుతున్న మాటలు ఆరోపణలకు మరింత బలం ఇచ్చే లాగా ఉన్నాయి.
ధర్మాన మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక వంటి మరో వ్యాఖ్య కూడా ఉంది. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చినందువలన పార్టీ నాయకత్వం మీద వైకాపా కార్యకర్తలు అందరూ మండిపడుతున్నారని కూడా ధర్మాన చెప్పుకొచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలుగా తమకు క్షేత్రస్థాయిలో ప్రజలలో ఉండగల గౌరవాన్ని, హవాను వాలంటీర్లు దెబ్బ కొడుతున్నారని కార్యకర్తలు ఫీలయిపోతున్నారట. ధర్మాన వారిని కూడా వూరడించే ప్రయత్నం చేశారు.
ధర్మానప్రసాదరావు చాలా సీనియర్. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో కూడా పనిచేశారు. జగన్ తొలివిడతలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అలిగారు. మలివిడతలో దక్కించుకున్నారు. కానీ ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి విమర్శలైతే చేస్తున్నాయో.. అవన్నీ నిజమే అని ధ్రువీకరించేలా ఆయన బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ పార్టీ పరువు తీస్తూ ఉంటారని పార్టీలోనే పలువురు వాపోతున్నారు.