వైసీపీ భూదోపిడీపై హైకోర్టులో పిటిషన్!

Wednesday, January 15, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంటున్న ముసుగులో సాగిస్తున్న భూదోపిడీ వ్యవహారంపై హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కానుంది. ఆ ప్రాంతాలకు చెందిన తమ నాయకులు లేదా ప్రెవేటు వ్యక్తుల ద్వారా ఈ దావా వేయించడానికి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇవ్వడం అనే వ్యవహారం రచ్చరచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ తరఫున జిల్లా కార్యాలయం కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం, 33 ఏళ్ల లీజుకు వారు కోరుకున్న ప్రభుత్వ స్థలాలను తక్షణం లీజుకింద ఇచ్చేయడం జరుగుతోంది. అయితే కోట్లకు కోట్ల విలువైన భూములను కారుచౌకగా తీసుకుంటూ ఒక పెద్ద దందాకే పాల్పడుతున్నారు. బాపట్లలో ప్రధానమైన ప్రాంతంలో రెండెకరాలు ఆర్టీసీ స్థలాన్ని కేవలం ఒక ఏడాదికి వెయ్యి రూపాయల రుసుము చెల్లించేలా లీజుకు వైసీపీ తీసుకోవడం ముందుగా బయటకు వచ్చింది. అక్కడ వైసీపీ నాయకులు భూమిపూజ చేయడానికి వెళ్లినప్పుడు.. స్థానిక ఆర్టీసీ డీఎం, అధికార్లు వచ్చి అడ్డుకోవడం.. స్థలం మాది అని పోలీసులకు, తహశీల్దారుకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వైసీపీ పరువు పోయింది. గుస్సా అయిన అధికారులు, ఫిర్యాదు చేసిన అధికారిపై వేటు వేశారు. 

ఇతర జిల్లాల్లో కూడా ఒక్కటొక్కటిగా ఇలా ఎకరాల కొద్దీ భూములు తీసుకుంటూ.. ఏడాదికి వెయ్యి, వెయ్యిన్నర లీజుమొత్తం చెల్లించేలా కుదుర్చుకున్న ఒప్పందాల బాగోతాలు బయటకు వచ్చాయి. వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కారుచౌకగా భూములు కొట్టేస్తున్నదని, ఆయా స్థలాలకు ఉన్న మార్కెట్ విలువను బట్టి లీజు అద్దెలు నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. 

అదే సమయంలో వైసీపీకి ఇలా కారుచౌకగా లీజుకు స్థలాలు అప్పగిస్తే గనుక.. ఇతర పార్టీలు కూడా తమ తమ జిల్లా కార్యాలయాల కోసం అడుగుతాయి. అందరికీ ఇలా ఇచ్చుకుంటే పోతే ప్రభుత్వఖజానాకు పెనునష్టం వాటిల్లుతుంది. జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రధానమైన ప్రభుత్వ భూములను పార్టీలన్నీ కలిసి పంచేసుకున్నట్టుగా తయారవుతుంది. ఇతర పార్టీలకు ఇవ్వకపోతే అది మళ్లీ ఇంకో కేసు అవుతుంది. అధికారపార్టీకి మాత్రం స్థలాలు లీజుకు ఇచ్చి, ఇతర పార్టీలకు ఇవ్వకపోతే.. మళ్లీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles