‘వైసీపీ నేత’ అంటే పులిస్వారీ చేస్తున్నట్టేనా?

Wednesday, December 18, 2024

అసలు రాజకీయాలు అంటేనే పులిస్వారీ లాంటివి. ఒకసారి పులిమీదకు ఎక్కి స్వారీ ప్రారంభించిన తర్వాత.. చచ్చేవరకు కొనసాగించాల్సిందే. ‘మధ్యలో దిగేస్తా’ అంటే కుదరదు. ఎందుకంటే, దిగితే పులి తినేస్తుంది. దిగకుండా.. చచ్చేదాకా ఇష్టం ఉన్నా లేకున్నా ఆ స్వారీచేస్తూనే ఉండాలి..
ఇది పులిస్వారీ అనే సామెతకు సంబంధించిన కథ. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంటేనే.. పులిస్వారీ లాగా కనిపిస్తోంది. ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు వచ్చే స్థాయికి వెళ్లిన తర్వాత.. ఇక ఆ పార్టీని వదలి వెళ్లడానికి లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ పార్టీలో కొనసాగాల్సిందే. పార్టీ వద్దని అనుకుంటే.. మిగిలిన నాయకులు వేధింపులు ప్రారంభిస్తారు. తప్పుడు కేసులు పెడతారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు తెస్తారు. రకరకాలుగా ఇబ్బంది పెడతారు.
ఇలాంటి సరికొత్త రాజకీయ పరిణామాలు కమలాపురంలో కనిపిస్తున్నాయి. ఈ జిల్లా కమలాపురం మునిసిపాలిటీ పరిధిలో 20 వార్డకు నీలం ప్రమీల అనే మహిళ కౌన్సిలరుగా వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. కొంత కాలానికే పార్టీ వైఖరితో విసిగిపోయారు. విముఖతతో.. తెదేపా నేత పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో నీలం ప్రమీల దంపతులు టీడీపీ లో చేరిపోయారు. అప్పటినుంచి ఆమెకు వైసీపీ వారినుంచి వేధింపులు ప్రారంభం అయ్యాయి.
ఆమె కౌన్సిలరుగా ఎన్నిక కావడానికి తాము 25 లక్షలు ఖర్చు పెట్టాం అని.. ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అంటూ పార్టీ స్థానిక నాయకులు ఆమె మీద ఒత్తిడి తేవడం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ సంఘం జిల్లా ఛైర్ పర్సన్ పి మేరీ అనే మహిళ వేరే పనిగా పోలీసుల వద్దకు వచ్చినప్పుడు.. ఆమె తెల్లకాగితమ్మీద సంతకం పెట్టించుకుని, దాని మీద తనపై అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు ఫిర్యాదు బనాయించారనే ఆరోపణ ఉంది. వైసీపీనుంచి వెళ్లిపోయిన నీలం ప్రమీల భర్త నీలం నరేంద్ర మేరీపై అత్యాచారం చేసినట్లుగా కేసు బనాయించి అతడిని అరెస్టు చేశారు. చివరికి తాను ఫిర్యాదు చేయకుండానే కేసు ఎలా పెడతారంటూ.. మేరీ పోలీసులను నిలదీయడంతో పాటూ కోర్టులో కూడా వాంగ్మూలం ఇవ్వడంతో నరేంద్రం జైలునుంచి విడుదలయ్యారు. ఈలోగా నీలం ప్రమీల రాజీనామా చేసినట్టుగా ఓ లేఖను బనాయించి.. కమలాపురం మునిసిపాలిటీ సమావేశంలో ఆమె రాజీనామాను ఆమోదించినట్టుగా తీర్మానం కూడా చేసేశారు. మరో హత్య కేసులో కూడా ఆమె భర్థ నరేంద్రను ఇరికించడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా వారు గొల్లుమంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు నచ్చక.. వేరే పార్టీలోకి వెళ్లిపోయినంత మాత్రాన.. తమ మీద ఇన్ని రకాలుగా వేధింపులు సాగుతున్నాయంటూ వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. నచ్చిన మతంలో, నచ్చిన పార్టీలో చేరడం అనేది మన దేశం ప్రజలకు రాజ్యాంగం అందించే మౌలికమైన హక్కు అని, కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆ హక్కులన్నింటినీ కాలరాసి.. తాము చెప్పిందే రాజ్యాంగం అన్నట్టుగా సాగిస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles