వైసీపీ కోటగోడలు బీటలు వారుతున్నాయా?

Saturday, September 7, 2024

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. మరో ముప్పయ్యేళ్లపాటు తాను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటానని నమ్ముతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలకు గండిపడుతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటగోడలకు బీటలు పడుతున్నాయా? అనే అభిప్రాయం పలువురిలో ఏర్పడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.  వారిలో ఇద్దరు తెలుగుదేశం పంచన చేరారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలపై పార్టీ గుర్రుగా ఉండడంతో.. ప్రస్తుతానికి వాతావరణం గుంభనంగా ఉన్నది గానీ.. వారు కూడా విపక్షాలవైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. వైసీపీ కీలక నాయకులు ఇద్దరు రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోజుల వ్యవధిలోనే పార్టీకి దూరం కావడం చర్చనీయాంశంగా మారుతోంది.

విశాఖపట్టణం జిల్లా పార్టీ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో చేరడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింది స్థాయి నాయకులు అసంతృప్తితో పార్టీకి దూరం అవుతుండడం అనేది ఒక ఎత్తు. కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడే ఫిరాయించడం ఇంకో ఎత్తు. అధినేతకు ఎంతో నమ్మకం ఉన్న వ్యక్తికే జిల్లా సారథ్యం అప్పగిస్తారు. పైగా విశాఖపట్టణాన్ని రాజధానిగా చేస్తామంటూ వైసీపీ సర్కారు అక్కడి ప్రజలను బాగా నమ్మిస్తోంది. ఆ పార్టీ నాయకులంతో వచ్చే నెలలోనే ప్రభుత్వం మొత్తం ఇక్కడకు వచ్చేస్తున్నదని కొన్నేళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. అది జరిగినా జరగకపోయినా.. విశాఖ మీద వైసీపీ స్పెషల్ ఫోకస పెడుతూ ఉందన్నమాట వాస్తవం. రాజధాని ప్రకటనలతో విశాఖతో పాటు, యావత్ ఉత్తరాంధ్ర తమకు నీరాజనం పడుతుందని కూడా వైసిపి కలగంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడే పార్టీని వదిలిపోవడం అనేది ఆశ్చర్యకరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తూ ఉండే స్థానిక నాయకుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ పట్ల విశాఖ వాసుల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను గమనించినందువల్లనే తెలుగుదేశంలోకి వెళుతున్నారనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.

అదే సమయంలో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ కీలక నాయకుడు ఆమంచి రాములు జనసేన పార్టీలో చేరడం అధికార పక్షానికి మరో దెబ్బ. ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే రాములు. కృష్ణమోహన్ ను పరుచూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించిన తర్వాత చీరాలలో ఆయన వర్గం స్తబ్దంగానే ఉండిపోయింది. అలాగని అక్కడి ఎమ్మెల్యే కరణం బలరాం వర్గంతో వారికి ఉన్న విభేదాలు సమసిపోలేదు అనేందుకు నిదర్శనంగా రాములు తాజాగా జనసేన లో చేరారు.

ఇలాంటి పరిణామాలు వైఎస్సీర్ కాంగ్రెస్ కోట గోడలు బద్దలవుతుండడానికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ముందుముందు మరిన్ని పరిణామాలు కూడా పార్టీని ఇబ్బందిపెట్టవచ్చునని అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles