కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది రాబోయే ఎన్నికల్లో తాము బరిలోంచి పక్కకు తప్పుకోవాలని అనుకుంటున్నారు. తమ తమ స్థానాల్లో వారసులను రంగప్రవేశం చేయించాలని కూడా కలగంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయగల వారికి కూడా విన్నవించుకుంటున్నారు. అయితే వారి ఆశలు తీరే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న జట్టుతోనే 2024 ఎన్నికలను కూడా ఎదుర్కోబోతున్నట్టుగా ఇప్పటికే జగన్ పలుమార్లు సూచన ప్రాయంగా ప్రకటించగా, జగన్ కు అత్యంత సన్నిహితుడుగా మెలగుతూ పార్టీలో కీలకంగా వ్యవహరించే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాజా మరోసారి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశం అని, తాము తప్పుకుని వారసులను నిల్చోబెడతాం అంటే కుదరదని తేల్చేశారు. వారసులకు ఇంకా సమయం ఉన్నదని.. వారసత్వ హోదాతోనే గత ఎన్నికల నాటికే రంగప్రవేశం చేసిన మిథున్ రెడ్డి సెలవివ్వడం విశేషం.
జనరల్ గా ఎవరైనా సరే.. చచ్చేదాకా తామే అధికారం వెలగబెట్టాలని కలగంటూ ఉంటారు. అధికారంలో ఉండే మజా అలాంటిది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చిత్రంగా చాలామంది సీనియర్లు, ఇంకా పూర్తిగా రాజకీయాలనుంచి విరమించుకోవలసినంత వయస్సును చేరుకోనివాళ్లు కూడా వైరాగ్యం ప్రకటిస్తున్నారు. తమ స్థానంలో వారసులను నిలబెట్టాలని జగన్ ను కోరుకుంటున్నారు.
తమ సారథ్యంలోనే వారసులను రాజకీయంగా స్థిరపరిచేయాలనేది ఇందుకు ఉండగల ఒక కీలక కారణం కాగా, జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరళిలో సీనియర్లు అయిన వారు ఇమడలేకపోతున్నారనేది ఇంకో వాదన. ఏదేమైనప్పటికీ.. వారు తప్పించుకోదలచుకున్నా.. జగన్ వదిలిపెట్టేలా లేరు.
అయితే ఈ విషయంలో కొందరికి మాత్రం మినహాయింపు ఉన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఆయన కొడుకును రంగంలోకి దించడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. కొడుకు ఆల్రెడీ ప్రచార పర్వంలోనే ఉన్నాడు. అలాగే తిరుపతినుంచి భూమన కరుణాకర రెడ్డి కూడా వారసుడు అభిషేక్ ను రంగంలోకి దించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అంటే వారసులకు అవకాశం ఇవ్వడంలో కూడా ‘అయినవాళ్లు – కానివాళ్లు’ అనే వ్యత్యాసాలను జగన్ పాటిస్తారేమో అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.