వైసీపీలో ఇది ‘వెనుకబడిన’ నామ సంవత్సరం!

Saturday, November 16, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, సామాజిక వర్గాల పరంగా ఈ ఒక్క ఏడాదిలో గణనీయమైన మార్పు రాబోతున్నది.ఇన్నాళ్లుగా పార్టీ దృష్టిలో ప్రాధాన్యం దక్కించుకున్న కులాలు వేరు.. రాబోయే ఏడాది కాలంలో ప్రాధాన్యం దక్కించుకోబోతున్న కులాలు వేరు అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది. ఏడాది తర్వాత ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీసీ కులాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకును పదిలపరచుకోవాలని పార్టీ తలపోస్తుండడమే అందుకు కారణం. ప్రభుత్వం పరంగా ప్రతి విషయంలోనూ నియామకాల దాకా వస్తే బీసీలకు పెద్దపీట వేయబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 21 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఇలా అన్ని రకాల ఎమ్మెల్సీ సీట్లూ ఉన్నాయి. వీటిని తిరిగి భర్తీ చేయడంలో మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఎక్కువగా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాల్లో ప్రతిష్ఠ పెరుగుతుందని వైసీపీ భావిస్తోంది.
ఖాళీ అవుతున్న సీట్లలో తెలుగుదేశానికి చెందినవి సగానికి పైగానే ఉంటాయి. అయితే అవన్నీ కొత్తగా అధికార పార్టీకే దక్కుతాయి. అలాగే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను ఖాళీ అయ్యే సీట్ల సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా.. కొత్తగా మరిన్ని కులాలను ఆకర్షించేందుకు ఈ పదవుల్ని వాడుకునే ఆలోచన చేస్తున్నారు. వైసీపీకి చెందిన వారిలో.. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని కోల్పోతున్న వారిలో చాలా కొద్ది మంది మాత్రమే మరోసారి అవకాశం పొందనున్నారు. ఖాళీ అవుతున్న వైసీపీ సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ సొంత సామాజిక వర్గానికి మాత్రమే మేలుచేస్తున్నారని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇలాంటి ఎత్తుగడలు అనుసరించే అవకాశం ఉంది.
అదే సమయంలో ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులు ఇతర వ్యవహారాల్లో.. పార్టీలో అంతర్గతంగా చాలా నియోజకవర్గాల్లో ఉన్న ముఠా కుమ్ములాటలను ఒక కొలిక్కి తీసుకురావడానికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్న రెండో నాయకులు.. చాలా చోట్ల కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారు. నాయకుల మధ్య సర్దుబాటు చేయడంలో, సఖ్యత సాధించడంలో పార్టీ అగ్ర నాయకులు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా సక్సెస్ అయిన నియోజకవర్గం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో.. కనీసం ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేస్తే విభేదాలు సద్దుమణగతాయని లేకపోతే.. ఎన్నికల నాటికి ఈ ముఠా కుమ్ములాటలు పార్టీని ముంచుతాయని వారు భయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles