వైసీపీనుంచి మరో నెల్లూరు ఎమ్మెల్యే జారుకుంటారా?

Thursday, December 19, 2024

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసి, అన్ని స్థానాలను తమ పార్టీ గెలుచుకున్నప్పుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మురిసిపోయి ఉంటారు. కానీ నాలుగేళ్లు గడిచేసరికి నెల్లూరు జిల్లానే ఆయనకు కంగారు పుట్టిస్తోంది. పార్టీకి ఉన్న 151 మందిలో తిరుగుబాటు బావుటా ఎగరేసి, జగన్ ను ఖాతరు చేయకుండా పార్టీనుంచి సస్పెండ్ అయిన నలుగురిలో ముగ్గురు ఈ నెల్లూరు జిల్లాకు చెందిన వారే. అలాంటిది ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా వైసీపీని కాదనుకుని దూరం జరగడానికి సిద్ధమవుతున్నారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.
ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే పేరు సంజీవయ్య. సూళ్లూరుపేట అనేది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ పేరుకు ఒక ఎమ్మెల్యే ఉంటారు గానీ.. ఆయనపై రెడ్ల పెత్తనం సాగుతుంటుంది. ఇక్కడి ఎమ్మెల్యే సంజీవయ్య, బాబురెడ్డి అనే ఒక పార్టీ కార్యకర్తకు మునిసిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించారు. కొన్నాళ్లకు ఆ ఉద్యోగం ఊడింది. ఎమ్మెల్యేను నిందిస్తూ ఆ బాబురెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సొంత పార్టీ వాడనిచూడకుండా.. ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి బాబురెడ్డిని కొట్టించారు.
ఆ తర్వాతే మొదలైంది అసలు కథంతా. స్థానిక రెడ్డి నాయకులంతా ఒక్కటయ్యారు. బాబురెడ్డిని వెనుకేసుకు వస్తున్నారు. అతడిని పరామర్శించి ఊరడిస్తున్నారు. వారి వైఖరి చూసి సంజీవయ్యకు ఒళ్లు మండింది. నన్ను తిడుతూ పోస్టులు పెట్టిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారా.. అంటూ సొంత పార్టీ రెడ్డి నాయకుల మీద ఆయన గుస్సా అయ్యారు. ఇలాంటి కుల, ముఠా తగాదాలు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. కానీ సూళ్లూరుపేట గొడవలు లోకల్ గా సమసిపోలేదు.
బాబురెడ్డి అనే యువకార్యకర్తను సొంత పార్టీ ఎమ్మెల్యే కొట్టించడం పైదాకా వెళ్లింది. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న భార్గవరెడ్డి స్వయంగా బాబురెడ్డికి ఫోను చేసి పరామర్శించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఎమ్మెల్యేను పక్కన బెట్టి స్వయంగా పరామర్శించారు. పార్టీలో కాక పెరిగింది. నియోజకవర్గంలోని రెడ్డి వర్గం వాళ్లందరూ సంజీవయ్యకు మళ్లీ టికెట్ ఇస్తే మేం ఓడిస్తాం అని గట్టిగా అంటున్నారు. రెండుసార్లు వైసీపీ తరఫున గెలిచిన సంజీవయ్య.. ఇప్పుడు ఆ పార్టీలోని లోకల్ నాయకులంటేనే మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ ఎంత మేర సీరియస్ గా తీసుకుంటుందనేది బోధపడడం లేదు. దానిని బట్టి.. సంజీవయ్యను కూడా జగన్ హిట్ లిస్టు లో పెడతారా? లేదా, ఈ రెడ్డి పెత్తనం భరించలేక సంజీవయ్యే తాను పార్టీనుంచి జారుకుని తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో పడతారా? అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles