మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది.. అటు ఉత్తరాంధ్ర వాసుల్ని గానీ, ఇటు రాయలసీమ వాసుల్ని గానీ మెప్పించడం లేదు అనేది నిరూపించబడిన సత్యం! కోస్తాంధ్ర సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి అమరావతి రాజధాని మీదనే మక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా స్పష్టంగా నిరూపించాయి. అమరావతికి చేసిన ద్రోహమే.. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీనీ దారుణంగా ఓడించింది. అయితే బొత్స వంటి తలాతోకా లేకుండా మాట్లాడే నాయకులు.. తమ మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇంకాస్త పతనం దిశగా నడిపించేలా కనిపిస్తున్నారు.
తాజాగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోట్ల రూపాయల ప్రజాధనం తీసుకువచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అంటూ వెటకారంగా వ్యాఖ్యానించడం తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా దానిని గేలి చేయడానికి ఆయన ఈ మాట అంటున్నారు గానీ.. ఆ మాట ద్వారా వైసీపీకి మరణశాసనం రాస్తున్నారనే సంగతి మర్చిపోతున్నారు. మూడు రాజధానుల విధానంతోనే తమ పారట్ీ ఈసారి సార్వత్రిక ఎన్నికలకు వెళుతుందని బొత్స అంటున్నారు. వెళితే వెళ్లవచ్చు గాక.. కానీ అమరావతిని హేళన చేయడం అనేది వారికి తప్పకుండా మరణశాసనం అవుతుందని వారు గుర్తించడం లేదు. అమరావతి విషయంలో అబద్ధాలను ప్రచారం చేయడం, లేనిపోని భయాలను ప్రజల్లో నాటడం పనిచేయదని వారు తెలుసుకోవడం లేదు.
చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసిన విధానంలో.. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ప్రాజెక్ట్ అనేది ప్రజలందరికీ తెలుసు. అమరావతి నగరాన్ని చంద్రబాబు కలగన్నట్టుగా లేదా, ప్లాన్ చేసినట్టుగా ఆచరణలోకి రావడానికి లక్షల కోట్లు ప్రజాధనం ఖర్చుచేయాల్సి రావడం అనేది శుద్ధ అబ్ధం. అలాంటి అబద్ధాలను ప్రచారం చేసి అమరావతి మీద రాష్ట్రప్రజల్లో ద్వేషం పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ పాచిక పారలేదు.
అమరావతి అనే స్వప్నాన్ని సర్వనాశనం చేయడానికి వారి కుట్రలను ప్రజలు గుర్తించారు గనుకనే.. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ దారుణంగా ఓడించారు. ప్రజల్లో ఆ వ్యతిరేకతను గుర్తించకుండా.. బొత్స వంటి నాయకులు.. ఇంకా అమరావతి మీద విషప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రజలు మరింతగా ఛీ కొడతారు. మొత్తంగా వైసీపీ పతనానికి సొంత నాయకుల ఇలాంటి మాటలే కారణం అవుతాయని ప్రజలు విశ్లేషిస్తున్నారు.
వైసీపీని పతనం దిశగా నెడుతున్న బొత్స!
Sunday, November 17, 2024