జెపి నడ్డా శ్రీకాళహస్తిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శల జడివాన కురిపిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ లోని పెద్దలు మరీ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో విమర్శించాలి గనుక.. విమర్శించారు అంతే అనే భావనతో ఉండిపోయారు. నామ్ కేవాస్తేగా ప్రభుత్వం తరఫున కొందరు.. నడ్డా, సోము వీర్రాజు విమర్శలను ఖండించారు. అసలైన పెద్దల ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయని వారు అనుకున్నారు. కానీ.. వారి అంచనాలను విశాఖలో అమిత్ షా సభ పూర్తిగా తుంగలో తొక్కింది.
నడ్డా కేవలం ట్రైలర్ మాత్రమే చూపించారని అనిపించేలా.. విశాఖలో అమిత్ షా ఫుల్ సినిమా చూపించేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒక రేంజిలో ఆడుకున్నారు. హత్య రాజకీయాలు, వివేకానందరెడ్డి హత్య కేసులో బయటకు వస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర అనే ఒకటిరెండు అంశాలు తప్ప జగన్ సర్కారు మీద జనసామాన్యంలో ఉన్న అన్ని అంశాలనూ అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. తద్వారా.. జగన్ సర్కారు పట్ల తమలో ఎలాంటి ప్రేమ, సానుభూతి లేవని తెగేసి చెప్పినట్లయింది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే పేరుతో రాష్ట్రానికి అసలైన రాజధానిగా అభివృద్ధి చేస్తాం అని జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదినుంచి చెబుతూనే ఉన్నారు. అయితే.. విశాఖ అభివృద్ధి విషయంలోనే అమిత్ షా నిప్పులు చెరిగారు. విశాఖ నగరాన్ని మొత్తం కబ్జాలు చేసేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, విశాఖ అరాచకాలకు అడ్డాగా మారిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వారి కనుసన్నల్లో భూ మాఫియా, మైనింగ్ మాఫియా సాగుతోందని అన్నారు.
జగన్ తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారని, కానీ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే టాప్ 3 పొజిషన్ లో ఏపీ ఉన్నదని ఎద్దేవా చేశారు.
అమిత్ షా ఈ రేంజిలో విరుచుకు పడడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు మింగుడుపడడం లేదు. పీఎం మోడీతో, తమ ముఖ్యమంత్రి జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయని, కమలం పార్టీ వల్ల తమకు ఎలాంటి ముప్పు ఉండదని ఆ పార్టీ వారిలో ఇన్నాళ్లుగా ఉన్న నమ్మకం అమిత్ షా ప్రసంగంతో పటాపంచలు అయిపోయింది. అలాగే మోడీజీతో సత్సంబంధాల వలన.. టీడీపీ కమలదళంతో పొత్తు పెట్టుకోదలచుకున్నా సరే.. అది కార్యరూపం దాల్చదనే అభిప్రాయం వారికి ఉండేది. ఇప్పుడు అది కూడా చెరగిపోయింది. ఈ స్థాయిలో వీరు విరుచుకుపడుతున్నప్పుడు.. టీడీపీ- జనసేనతో కూటమితో బిజెపి కూడా కలవడానికి అవకాశం ఉంటుందని వారు అనుకుంటున్నారు. నిజానికి పొత్తుల విషయంలో బిజెపి వైపునుంచి సంకేతాలు ఏమీ రాలేదు. కానీ పొత్తులు దుర్లభం అనే అభిప్రాయం ఎవరికీ కలగకుండా అమిత్ షా సభ సాగిపోయింది. అందుకే ఆయన మాటలతో వైసీపీ దళాలు షాక్ కు గురైనట్టుగా కనిపిస్తోంది.
వైసీపీకి షాక్ : అమిత్ షా కూడా నిప్పులే!
Saturday, January 18, 2025