ఇదేమిటి హెడ్డింగ్ ఏమైనా తప్పు పడిందా? అని మీకు అనుమానం కలగవచ్చు గాక! మోడీ సేవలో వైసిపి దళాలు కదా ఇప్పుడు పనిచేస్తున్నాయి.. అనే ఆలోచన కూడా రావచ్చుగాక. ప్రధానమంత్రి విశాఖకు వస్తున్న నేపథ్యంలో ఆయన సేవలో తరించడానికి, ఆయన బహిరంగ సభకు రెండు మూడు లక్షల మంది జనాన్ని పోగు చేయడానికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సొంత నాయకుడు బహిరంగ సభల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారనే మాట వాస్తవం. అయితే ఇదంతా మోడీ సేవలో వైసిపి ఉన్నట్టు అవుతుంది కానీ.. వైసీపీ సేవలో కమల దళపతులు అని ఎలా అనగలరు అనే సందేహం ఎవరికైనా పుడుతుంది!
ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులతో భేటీ కాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటకు ప్రధానంగా ఒక వ్యవహారం చర్చకు రానుంది. అదే ‘మోడీ సేవలో కమల దళపతులు’ అనే సబ్జెక్ట్! ఎందుకంటే బిజెపిలో కీలక స్థానాల్లో ఉండే అనేకమంది నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లాగా, తైనాతీల్లాగా పనిచేస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే చాలా కాలం నుంచి ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు అన్ని చాలా సుతిమెత్తగా ఉంటాయి. అలాగే అనుసరించే ధోరణులు జగన్ కు మేలు చేసేలా మారుతుంటాయి! సోము వీర్రాజు వైసిపి అనుకూల వైఖరి మీద కమలదళంలో చాలామంది నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ టాపిక్ ను ఇవాళ మోడీతో జరిగే భేటీలో ప్రధానంగా చర్చకు తెస్తారని తెలుస్తోంది.
సోము వీర్రాజు తనలోని జగన్ అనుకూల వైఖరిని దాచుకోలేక గతంలో అమిత్ షా ఎదుట బయటపడిపోయారు. అక్షింతలు వేయించుకున్నారు. అయినా సరే ఆ తర్వాత ఆయన పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఉన్నట్లయితే మరింతగా పతనం అవుతుందే తప్ప రాష్ట్రంలో కమలం వికసించే అవకాశం లేదని ఇతర నాయకులు మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
నిజానికి ఏపీ బీజేపీ సంకట స్థితిలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే బిజెపి నాయకులేమో జగన్ భజన చేయాలని ఆరాటపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశంతో కలిసి అడుగులు వేస్తే తప్ప అధికారంలోకి రావడం అసాధ్యం అని ఉద్బోధిస్తున్నారు. ఎటూ తేల్చుకోలేని సంకట పరిస్థితి ఇవాళ ప్రధాని నరేంద్రమోడీకి ఎదురు పడనుంది. ఆయన వారికి ఏం దిశానిర్దేశం చేస్తారో చూడాలి.