ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చాలా సహజంగా జరిగిపోతూ ఉన్నది. ప్రస్తుతం హాట్ హాట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సారధి జగన్మోహన్ రెడ్డి మధ్యనే మాటల యుద్ధం నడుస్తోంది. మామూలు అలవాటు ప్రకారం పవన్ కళ్యాణ్ ఎన్ని సందర్భాలలో ఎన్ని తిట్లు తిట్టినా సరే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరగదు. ఆయన ఆ తర్వాత ఏదో ఒక పబ్లిక్ మీటింగ్ కు వచ్చినప్పుడు అన్ని రోజుల పాటు పవన్ చేసిన అన్ని విమర్శలకు ఒకేసారి సమాధానం ఇచ్చేస్తారు. అయితే పవన్ మాత్రం జగన్ తన గురించి మాట్లాడిన ప్రతిసారి దానికి కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. పవన్ కౌంటర్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రధానంగా ప్రతి విమర్శలు వినిపిస్తూ ఉంటారు.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను గమనిస్తే వారు ప్రజల పట్ల చేస్తున్న బెదిరింపులు- ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిపిస్తాయని అనుకోవడం భ్రమ అని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆరోపిస్తుంటారు. సంక్షేమ పథకాల ముసుగులో ప్రజలకు ద్రోహం చేస్తున్నారనేది ఇంకొక ఆరోపణ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రతివిమర్శలు చాలా కనీస స్థాయిలో ఉన్నాయి. పార్టీకి ఉపయోగపడతాయని, ఓట్లు రాలుస్తాయని అనుకోవడం భ్రమ! ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవిలో నుంచి దిగిపోతే గనుక ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవీ ఉండవని లబ్ధిదారులు అందరూ నానా పాట్లు పడాల్సి వస్తుందని అధికార పార్టీ వ్యూహాత్మకంగా తీవ్రమైన నెగటివ్ ప్రచారం చేస్తోంది. అయితే ఈ విమర్శకు ఇంకా వ్యాలిడిటీ ఉన్నదా అనేది ప్రజల సందేహం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కొన్ని పథకాల ఆలోచనలకు తానే శ్రీకారం దిద్ది ప్రారంభించి ఉండవచ్చు గాక. కానీ జగన్ దిగిపోయిన వెంటనే అవన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజలని భయపెట్టడం, ఓటర్లు అందరినీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులుగా తయారు చేయడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు దాదాపుగా పాపులారిటీ ఉన్న అన్ని జగన్ పథకాలను మరింత మెరుగుగా కొనసాగించే విధంగా తన తొలి మేనిఫెస్టోను ప్రకటించారు. అలాంటప్పుడు, ‘జగన్ పోతే పథకాలు కూడా పోతాయి’ అనే భయం ప్రజల్లో ఎందుకు ఏర్పడుతుంది? ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోకుండా పథకాల ముసుగులో ఒక భయాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయాలి అంటే అది కుదిరే పని కాదు. తాము నిజంగా మళ్లీ గెలవాలనే ఉద్దేశం వైఎస్ఆర్సిపి పెద్దలలో ఉంటే గనుక.. పథకాలు ఆగిపోతాయి లాంటి పడికట్టు పదాలు, అబద్ధాలతో ప్రచారం ముందుకు తీసుకెళ్లకుండా.. కొత్త దారులు వెతుక్కోవాలి!