‘వైయస్సార్ జయంతి’ కాంగ్రెస్ పార్టీ ఆవు వ్యాసం!

Saturday, January 18, 2025

కాంగ్రెస్ పార్టీలో  ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకులు ఉన్నప్పటికీ వారికి జీవితాశయం ఒకే ఒక్కటి ఉంటుంది. అది యువనేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిని చేయడం! ఆ పార్టీలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే బతుకుతెరువుగా కలిగిన నాయకులు, సోనియా కుటుంబానికి భజన చేయడంలోనే తమ జీవితాలకు పరమార్థం దాగి ఉన్నదని విశ్వసించే నాయకులు చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారందరికీ కూడా మెలకువలోనూ, కలలోనూ రాహుల్‌ను ప్రధాని చేయడం అనే లక్ష్యం ఒక్కటే కనుల ముందు మెదలుతూ ఉంటుంది. ప్రజల సమస్యలు కావచ్చు, పార్టీలోని పరిణామాలు కావచ్చు ఏ వ్యవహారం గురించిన సందర్భంగా అయినా సరే వారు రాహుల్ గాంధీని ప్రధాని చేసే అంశంతో ముడి పెట్టకుండా బతకలేరు. తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో కూడా ఇదే ధోరణి కనిపించడమే విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ఉద్దండుడైన జననేత, వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పార్టీ నాయకులు ప్రతిఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూనే ఉంటారు ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తుంటుంది. నిజానికి అది ఆ పార్టీకి అవసరం అయిపోయింది! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి నాయకుడు ప్రతి ఓటరు కూడా ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెసుకు అనుకూలంగానే మెదలుతూ ఉంటారు. తెలంగాణలో వైఎస్ కు ఉండగల ప్రజాదరణ పూర్తిగా తామే దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరిక! తొలి నుంచి వైఎస్ జయంతిని ఘనంగానే నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఆయన కూతురు షర్మిల పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఆ అలవాటును కొనసాగిస్తున్నారు. వైయస్ జయంతిని నిర్వహించడం ద్వారా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గ ఓట్లను తమకు అనుకూలంగా పదిలం చేసుకోవడం కూడా ఒక వ్యూహం. జయంతి సందర్భంగా వైయస్సార్ ను రాహుల్ గాంధీ ట్విట్టర్లో కొనియాడినా, అందుకు షర్మిల బహుధా కృతజ్ఞతలు తెలియజేసినా ఇవన్నీ కూడా వారి వారి అవసరాలలో భాగమే.

తాజాగా ఈ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ఆర్ ను కీర్తించారు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే వైయస్ఆర్ జీవిత ఆశయంగా ఉండేదని భట్టి ఈ సందర్భంగా వెల్లడించారు. రాహుల్‌ను మనమంతా కలిసి ప్రధానిని చేస్తేనే.. వైఎస్సార్ కు అది నిజమైన నివాళి అవుతుందని కూడా పిలుపు ఇచ్చారు. రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా రాహుల్ గాంధీ వారసత్వంపై వైయస్సార్ అభిమానంతో ఉన్న మాట నిజం. కానీ, తమ భజనపరత్వాన్ని వైఎస్ కు పులిమి తమ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం అనేది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే చెల్లింది. సబ్జెక్టు ఏదైనా సరే తనకు తెలిసిన ఆవు వ్యాసానికి ముడిపెట్టి ఆ వ్యాసం సంపూర్ణంగా రాసే విద్యార్థి లాగా- తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సందర్భం ఏదైనా సరే దానిని రాహుల్ ను ప్రధాని చేయడం అనే తమ భజనపరత్వపు కోరికకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles