‘వైఎస్ కోటరీ’కి ముచ్చెమటలు పట్టిస్తున్న ఒకే ఒక్కడు!

Sunday, January 19, 2025

అతను వారి ప్రాపకంలో వారి దయమీద బతుకుతూ వచ్చిన కారు డ్రైవరు. కారు డ్రైవరుగా బతుకుతున్నవాడు, భారీ మొత్తంలో డబ్బు ఎర వేస్తే తమకు అనుకూలంగా పనిచేస్తాడని వారు అనుకున్నారు. అయిదు కోట్ల రూపాయల ఆఫర్ తో లొంగదీసుకున్నారు. అనుకున్న పని పూర్తిచేశారు. కానీ ఇప్పుడు ఆ సాధారణ డ్రైవరు అప్రూవర్ గా మారి వారికి చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘వైఎస్ కోటరీ’కి మొత్తం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆ సాధారణ డ్రైవరు మరెవరో కాదు.. షేక్ దస్తగిరి!
ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనోభిప్రాయాలను తాను మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తూ ఉంటారనే పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లందరికీ ఇప్పుడు ఒక్కడే టార్గెట్- షేక్ దస్తగిరి. వారితో పోలిస్తే స్థాయి పరంగా ఎంతో చిన్నవాడైన దస్తగిరిని టార్గెట్ చేస్తూ.. వారంతా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. దస్తగిరిని బయటే ఎందుకు ఉంచారు. అతడికి బెయిలు సమయంలో సీబీఐ ఎందుకు అనుమతించింది. ఇదంతా సీబీఐ ఆడుతున్న నాటకం. వివేకా కూతురు సునీతమ్మ, సీబీఐ కలిసి దస్తగిరి డబ్బులు ఇచ్చి తమకు వ్యతిరేకంగా చెప్పిస్తున్నారు.. లాంటి అనేక ఆరోపణలు కేవలం దస్తగిరి చుట్టూ తిరుగుతున్నాయి.
అయితే.. స్థాయితో పోలిస్తే తాను చాలా చిన్నవాడిని అని దస్తగిరికి తెలుసు. తనకు ప్రాణానికి హాని ఉన్నదని కూడా ఆయన భయపడుతున్నారు. అయినాసరే రాజకీయంగా పెద్దలైన వారిని ఢీకొనడంలో ఏమాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు. దస్తగిరి వాంగ్మూలంలోని విశ్వసనీయతను సవాలు చేస్తూ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో.. నా వాంగ్మూలం తప్పయితే.. అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు. 2021లోనే నా వాంగ్మూలం బయటకు వచ్చింది కదా అని నిలదీస్తున్నారు. వాంగ్మూలం వల్ల నష్టం లేదని అప్పట్లో వారు అనుకున్నారు. కానీ సీబీఐ ఇతర ఆధారాల ద్వారా కూడా వారి పాత్రను ధ్రువీకరిస్తున్న తరువాత నా వాంగ్మూలం తప్పనే పాట ఎత్తుకున్నారు అని విమర్శిస్తున్నారు.
వివేకా హత్యకు ఇతర అంశాలు కారణాలైతే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటుచేసిన సిట్ లు ఆ విషయం ఎందుకు తేల్చలేకపోయాయనేది కూడా దస్తగిరి ప్రశ్న. ఇవేవీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘వైఎస్ కోటరీ’ జవాబు చెప్పగలిగే ప్రశ్నలు కావు. ఈ కేసు విచారణను కడపనుంచి తెలంగాణకు బదిలీ చేయడమే అవినాష్ తదితరులకు పరువుతక్కువ వ్యవహారం కదా అని ప్రశ్నిస్తున్న దస్తగిరి, తాను సునీతమ్మ దగ్గరినుంచి రూపాయైనా తీసుకున్నట్టు అవినాష్ రెడ్డి నిరూపించాలని, అలా చేయలేకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాలు విసురుతుండడం విశేషం.
ఒక్క వ్యక్తిని ప్రలోభపెట్టి గానీ, భయపెట్టిగానీ లొంగదీసుకోలేకపోతే.. ఎంత చికాకుగా ఉంటుందో ఆ పరిస్థితిని ఇప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి కుటుంబం అనుభవిస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి, పశ్చాత్తాపం చెందిన తర్వాత.. అసలు సూత్రధారులకు కొరుకుడు పడడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles