జగన్మోహన్ రెడ్డి తాను స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మోనార్క్ లాగా నిర్వహిస్తుంటారు. నిజానికి ఇందులో ఆయన తప్పేమీ లేదు. వ్యక్తులు స్థాపించే ప్రాంతీయ పార్టీలు 90 శాతం వరకు ఇదే తరహాలోనే నడుస్తుంటాయి. జగన్ కూడా అలాగే పార్టీని నడుపుతారు. పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్నట్టుగా అంతా ఆయన బొమ్మతోనే నడుస్తుంటుంది గానీ.. పార్టీలో వైఎస్సార్ కు ఆత్మీయులు అయిన సీనియర్ నాయకులు ఒక్కరకు కూడా జగన్ చోటు లేకుండా చేశారనే విమర్శ చాలా కాలంగా ఉంది. అయితే.. పార్టీలో ఒకటీ అరగా మిగిలిన వైఎస్ కు ఆత్మీయులు, ఆప్తులు అయిన నాయకులకు కూడా జగన్ చెక్ పెట్టేస్తున్నట్టుగా, ఎగ్జిట్ చూపిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తులుగా పేరున్న నాయకులు ఎవరూ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ లో లేరు. వైఎస్ఆర్ ఆత్మగా భావించే ఆయనకు అత్యంత సన్నిహితుడు కెవిపి రామచంద్రరావు అసలు ఈ పార్టీలో చేరనేలేదు. జగన్ పార్టీ ప్రకటన తర్వాత.. అటువైపు కూడా చూడలేదు. విశాఖకు చెందిన వైఎస్సార్ ఆప్తులు సబ్బం హరి, కొణతల రామకృష్ణ పార్టీలోకి వచ్చారు. సబ్బం హరి ఒక దశలో జగన్ కు చాలా కీలక మార్గదర్శిగా కూడా చెలామణీ అయ్యారు. తర్వాత వారిద్దరూ బయటకు వెళ్లారు. సబ్బం హరి ని వేధించడానికి ఆయన ఇంటి కూల్చివేతలు చేయించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే వైఎస్సార్ మరో ఆత్మీయుడు ఉండవిల్లి అరుణ్ కుమార్ కొన్నిసార్లు జగన్ తో భేటీ అయ్యారే తప్ప.. ఆయన పార్టీలో చేరలేదు. ఉండవిల్లిని జగన్ కూడా ఆదరించలేదు. ఆనం రామనారాయణ రెడ్డి, వైఎస్సార్ కు సన్నిహితుడిగా ఆయన కేబినెట్లో కూడా సేవలందించారు. ఆయన మీద ప్రస్తుతం వైసీపీ వేటు వేసేసింది కూడా.
ఇతర సీనియర్ల విషయంలో మైసూరారెడ్డిది ఒక ప్రత్యేక ఎపిసోడ్. వైఎస్ రాజశేఖర రెడ్డిని ‘ఒరేయ్’ అని పిలిచే అలవాటున్న మైసూరారెడ్డి తనను మాత్రం సార్ అని సంబోధించాల్సిందిగా జగన్ కోరుకునే వారని అప్పట్లో పుకార్లు వినిపించేవి. ఇలాంటి వాతావరణంలో ఇమడలేక పార్టీ స్థాపించిన చాలా కాలం వరకు జగన్ వెన్నంటి ఉన్నప్పటికీ తర్వాత మైసూరా బయటకు వెళ్లిపోయారు. కొండా సురేఖ, మురళి దంపతులు కూడా అంతే.
ఇన్నింటి మధ్యలో అసలు వైఎస్సార్ భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిల కూడా జగన్ కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ కోసం ఎంతో పాటుపడినప్పటికీ.. నెమ్మదిగా వారు పార్టీనుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పార్టీకే పరిమితం అయ్యారు.
స్థూలంగా చూసినప్పుడు.. వైఎస్సార్ తో ఆత్మీయత ఉన్నవారిలో , వైసీపీలో మిగిలిన ఏకైక నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయనను తొలుత మంత్రిని చేసి, తర్వాత ఎంపీగా పార్లమెంటుకు పంపారు జగన్. అయితే ఇప్పుడు ఆయనకు సొంత నియోజకవర్గంలో వైసీపీ వర్గవిభేదాల సెగ తగులుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ అయినా పార్టీలో కొనసాగుతారా? లేదా, ఆయనకు కూడా ఎగ్జిట్ డోర్ చూపిస్తారా? అని పలువురు అనుకుంటున్నారు. అదే జరిగితే.. పార్టీ పేరులో వైఎస్సార్ అనే పదం తప్ప.. ఆయన ఆప్తులు ఎవ్వరూ ఈ పార్టీలో లేనట్టేనని ప్రజలు భావిస్తున్నారు.