ఇవాళ వేటు వేశారు బాగానే ఉంది. ఇన్నాళ్లూ వాళ్లు తమ పార్టీలోనే ఉన్నారని, తమ పార్టీకి విధేయులు అని భ్రమపడుతూ ఉన్నారా? లేదా, రకరకాల సమీకరణల వలన వారి మీద వేటు వేయాలంటే భయపడుతూ వచ్చారా? భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపలి కృష్ణారావు మీద పార్టీనుంచి సస్పెన్షన్ వేటు విధించడం అనేది ఇలాంటి చర్చను రాజకీయవర్గాల్లో లేవనెత్తుతోంది.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా సొంత బలం ఉన్న నేత. కేవలం సామాజికవర్గ బలం మాత్రమే కాదు. దనబలం పుష్కలంగా ఉన్న నేత. దానికి తగ్గట్టుగానే అంగబలం కూడా ఉన్ననేత. కాబట్టే.. 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ కు బోణీ లేకపోయినప్పటికీ.. ఆయన ఖమ్మం ఎంపీగా గెలిచారు. తనవారిని గెలిపించుకున్నారు కూడా. తదనంతర పరిణామాల్లో ఆయన అనివార్యంగా కేసీఆర్ పార్టీలో చేరవలసి వచ్చింది. అక్కడకు ఆయన దక్కిన ఆదరణ మాత్రం లేదు.
కేసీఆర్ రాజకీయాలతో ఆయన పూర్తిగా విసిగిపోయారు. తన సొంతదారి ఏదో తాను చూసుకోవాలనుకున్నారు. భవిష్యత్ రాజకీయం ఏ పార్టీ వెంటనడవాలో చాలా స్పష్టంగానే నిర్ణయించుకున్నారు గానీ.. ఇప్పటిదాకా ఎలాంటి లీక్ ఇవ్వలేదు. భారాస వదిలేస్తున్నట్టు ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. అప్పటినుంచి గులాబీ రంగు అన్నది లేకుండా బోలెడు సమావేశాలు పెడుతున్నారు. మందిని పోగేస్తున్నారు. తన రాజకీయ బలం ఎంత ఘనంగా ఉన్నదో.. చేరబోయే కొత్త పార్టీకి చూపించుకుంటూనే ఉన్నారు.
జూపల్లి కృష్ణారావు పరిస్థితి కూడా అంతే. ఆయన కూడా.. పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసి చాలా కాలం అయింది. సొంత పార్టీ మీద, స్థానిక ఎమ్మెల్యేమీద ఘాటైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు. జూపల్లి కూడా సామాజికవర్గ పరంగాను, ఇతరత్రానూ బలమైన నాయకుడిగానే గుర్తింపు ఉంది. ఆయన కూడా తాను ఏ పార్టీలోకి వెళ్లబోయేదీ ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియనివ్వలేదు.
అయినా ఇన్నాళ్లుగా వీరి మీద ఇన్నాళ్లుగా పార్టీ వేటు వేయలేదు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి కొత్తగూడెంలో ఓ సభలో పాల్గొన్నారు. అలవాటుగానే కేసీఆర్ మీద, పాలన మీద, కుటుంబం మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఇద్దరి మీద పార్టీ సస్పెన్షన్ వేటు పడింది. ఇన్నాళ్లూ వేటు వేయకపోవడం అనేది.. భారాస వీరి పట్ల భయపడుతున్నదనడానికి నిదర్శనమా అనే చర్చ నడుస్తోంది. వారు ఇతర బలమైన పార్టీలోకి వెళ్లడం అనేది ఖచ్చితంగా తమకు చేటు చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ వేటు వేయకుండా.. వారిని బుజ్జగించవచ్చునని ఎదురుచూశారేమోనని అనిపిస్తుంది. ఈ సస్పెన్షన్ తర్వాత.. వారు తాము ఎంచుకున్న పార్టీలోకి చేరడం అనేది వెంటనే జరుగుతుందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.
వేటుకు లేటైంది.. భారాసకు భయమా?
Sunday, December 22, 2024