వెంకన్న దళారీలుగా షేక్ బాబ్జీలు ఇంకా ఎందరో?

Wednesday, January 22, 2025

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి భక్తకోటిలో ఎంత ఆదరణ ఉంటుందో అందరికీ తెలుసు. వేసవిలో అయితే తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తుల తాకిడిని, సత్వరమే దర్శనం చేసుకుని వెళ్లిపోవాలి, కాస్త డబ్బు ఎక్కువ ఖర్చయినా సరే.. అనుకునే భక్తుల వైఖరిని తిరుమలలో దళారులు ఎంచక్కా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. వీఐపీ దర్శనాలు, సిఫారసు ఉత్తరాల దర్శనాల ముసుగులో దళారీల వ్యవహారాలు నడుస్తుండడం చాలా తరచుగా వార్తల్లోకి వస్తుంటుంది. అయితే సాక్షాత్తూ ఒక ఏపీ ఎమ్మెల్సీ స్వయంగా ఇలాంటి దందాకు పాల్పడుతూ దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. తాను కూడా దర్శనానికి వెళుతూ, తనతోపాటు ఆరుగురిని తీసుకువెళ్లడానికి 1,05,000 రూపాయలు దందాకు పాల్పడిన షేక్ సాబ్జీ అనే ఎమ్మెల్సీ ఇప్పుడు తిరుమల విజిలెన్స్ పోలీసుల అధీనంలో ఉన్నాడు.
ఉభయగోదావరి జిల్లాల్లో 2021లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ బంపర్ మెజారిటీతో గెలిచారు.
తిరుమలేశుని దర్శనాలకు సిఫారసు ఉత్తరాలు ఇచ్చే విషయంలో ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రతిరోజూ ఒక సిఫారసు ఉత్తరం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ఉత్తరం మీద ఆరుగురికి దర్శనం ఏర్పాటుచేస్తారు. ప్రజాప్రతినిధి స్వయంగా వస్తే గనుక.. ఆయన వెంట ఉన్నవారికి కూడా ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది.
ఇది రివాజు కాదా, గోదావరి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చాలా తరచుగా తిరుమలేశుని దర్శనానికి వస్తుండడంతో విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. నిఘా ఉంచారు. ఆయన వెంట దర్శనానికి వెళుతున్న ఇతర రాష్ట్ర భక్తులు ఆరుగురిని నకిలీ ఆధార్ కార్డులతో తీసుకువెళుతున్నట్లుగా తేలింది. ఆ దర్శనానికి వారి నుంచి 1.05 లక్షల రూపాయల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డ్రైవరు అకౌంట్ కు తీసుకున్నట్టుగా విజిలెన్స్ వారు గుర్తించారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ షేక్ సాబ్జీ, ఒక నెలరోజుల వ్యవధిలో 19 సిఫారసు లెటర్లను, అన్నింటినీ ఇతర రాష్ట్రాల భక్తులకే ఇచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు.
అయితే షేక్ సాబ్జీ ఒక్కడేనా? ఆయన లాగా.. తిరుమల దేవుడి దర్శనం చేయించడాన్ని తమ దందాగా మార్చుకుంటున్న ప్రజాప్రతినిధులు ఇంకెవ్వరూ లేరా?అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. గతంలో ఒక మహిళా ఎమ్మెల్యే ప్రతినెలా తిరుమల దర్శనానికి వెళుతూ తన వెంట పదుల సంఖ్యలో జనాన్ని తీసుకువెళుతూ అందరికీ ప్రోటోకాల్ దర్శనం చేయించేదని, ఒక్కొక్కరి నుంచి 30వేల వంతున తీసుకునేదని కూడా ఆరోపణలు ఉండేవి. ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లెటర్లను బ్లాకులో అమ్ముకుంటూ ఉంటారనే ఆరోపణలున్నాయి. తిరుపతిలో పుష్కలంగా ఉండే దళార్ల ద్వారా ఇవి చెలామణీ అవుతుంటాయి. ఎమ్మెల్యేల దర్శనాలకు నియంత్రణ విధిస్తే తప్ప దర్శనాల ముసుగులో దళారీలు భాగోతాలు తగ్గే అవకాశం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles