వీళ్లందరకూ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ లే కావాలిట!

Sunday, December 22, 2024

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని వారు భావిస్తున్న నేపథ్యంలో నాయకుల మీద టికెట్ల కోసం ఒత్తిడి కూడా బాగా పెరుగుతోంది. 119 స్థానాలకు 1006 దరఖాస్తులు వచ్చిన ఒత్తిడి ఒకటైతే. ఒకే కుటుంబంలో ఒకటికంటె ఎక్కువ టికెట్లు కావాలనే ఒత్తిడి కూడా బాగా ఎక్కువగా ఉంటోంది. ఫ్యామిలీలో రెండు టికెట్లు ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తాను హైకమాండ్ కు సిఫారసు చేయను అన్నందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి వెళ్లిపోయిన సంగతి కూడా అందరికీ తెలుసు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఫ్యామిలీ ప్యాకేజీ టికెట్లుకోరడం ద్వారా.. తాను పార్టీకి ఫేవర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. తనకు హుజూర్ నగర్, తన భార్య పద్మావతికి కోదాడ టికెట్లు కావాలని ఆయన కోరుతున్నారు. ఇస్తే రెండు చోట్ల కూడా యాభై వేల వంతున మెజారిటీ సాధిస్తామని ఆయన భీషణ డైలాగులు వేస్తున్నారు. యాభై వేల మెజారిటీ రాకపోతే.. రాజకీయాలనుంచి పూర్తిగా విరమించుకుంటానని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇలాంటి ప్రతిజ్ఞలను రాజకీయాల్లో నమ్మేవారు ఎవరూ ఉండరు. కానీ, ఉత్తమ్ చాలా ఘాటుగా చెప్పినంత మాత్రాన ఆయన ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరికీ టికెట్లు ఇస్తే.. ఆయన ప్రత్యేకత మాత్రం ఏమున్నదని, అదే సిద్ధాంతాన్ని తామందరికీ కూడా వర్తింపజేయాలని ఇంకా అనేకమంది నాయకులు గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది నాయకుల కుటుంబాలనుంచి ఒకటికంటె ఎక్కువ మంది ఆల్రెడీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు.

వీరందరిలోనూ జానారెడ్డి తీరు చిత్రంగా కనిపిస్తోంది. ఆయన కొడుకులు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరికీ కూడా టికెట్లు ఇవ్వాలని, ఒకటే టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే.. అది తనకు మాత్రమే ఇవ్వాలని.. కొడుకుల్లో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే తనకు ఇబ్బంది అవుతుందని జానారెడ్డి అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు టికెట్లు కోరుతున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిష ఇద్దరూ ఆందోల్ నియోజకవర్గానికే దరఖాస్తు చేసుకోవడం ఒక చిత్రమైన పరిణామం. తండ్రీ కూతుళ్లలో ఎవరికి ఇచ్చినా ఓకే అనుకుంటున్నారో ఏమో తెలియదు.

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబాబాద్ అడుగుతూ, తన కుమారుడు సాయిశంకర్ నాయక్ కు ఇల్లందు టికెట్ కావాలంటున్నారు. రాజకీయంగా దంపతులిద్దరూ ప్రాబల్యం కలిగిఉన్న కొండా కుటుంబం నుంచి కూడా పార్టీకి ఈ ఒత్తిడి ఉంది. కొండా మురళి పరకాలనుంచి, మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. తాను ఎంపీ బరిలో ఉండడానికి ఇష్టపడే అంజన్ కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకొడుకులు ఇద్దరికీ టికెట్లు కావాలని అడుగుతున్నారు. ఇబ్రహీం పట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ ణుంచి ఆయన సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి దరఖాస్తు చేశారు.

బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ కూడా ఇద్దరూ టికెట్లు కోరుతున్నారు.

ఈ ఫ్యామిలీ ప్యాకేజీలలో మైనంపల్లి హన్మంతరావుది ఇంకో ప్రత్యేకమైన కేసు. ఎందుకంటే.. భారాస నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మల్కాజిగిరి నుంచి మళ్లీ టికెట్ దక్కించుకున్నారు. అయితే.. తనకు, తన కొడుక్కి కూడా టికెట్లు ఇచ్చేట్లయితే కాంగ్రెసులోకి వస్తానని అంటున్నారు. మెదక్, మల్కాజిగిరి టికెట్లను అడుగుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే టికెట్ తో పాటు, కావలిస్తే మల్కాజిగిరి ఎంపీ టికెట్ లేదా కూకట్ పల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అంటున్నట్టు సమాచారం.

కాంగ్రెసు పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతో ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వరాదని గతంలో నిర్ణయించింది. అయితే ఉత్తమ్ కోసం ఆ నియమం మీరితే.. వీరందరి నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుందని, ఇవ్వకపోతే అసంతృప్తి పెరుగుతుందని పార్టీ భావిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles