ఈ వైరాగ్యం కారకులు రాష్ట్రానికి ద్రోహులు!

Wednesday, January 22, 2025

విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణకు వైరాగ్యం జనించింది. తన భార్య కొడుకు కిడ్నాప్ అయ్యారు గనుక జీవితం మీద పుట్టిన వైరాగ్యం కాదు అది. వారి కిడ్నాప్ కు తన సంపదే కారణం అయ్యుండే నేపథ్యంలో వ్యాపారం మీద పుట్టిన వైరాగ్యం కాదు అది. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు వినిపిస్తుండగా రాజకీయం మీద పుట్టిన వైరాగ్యం కూడా కాదు అది. విశాఖపట్నం స్థానానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సత్యనారాయణకు విశాఖపట్నం మీదనే వైరాగ్యం పుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదనే వైరాగ్యం పుట్టింది. విశాఖపట్నంలో ప్రస్తుతం చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ ముగించుకున్న తర్వాత.. ఇక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాదు వెళ్లిపోతానని ఎంపీ సత్యనారాయణ బహిరంగంగా ప్రకటించారు. ఏ ప్రాజెక్టు చేయాలన్నా కనీసం అనుమతులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్న అధికారుల తీరు మీద ఆయన దుమ్మెత్తి పోశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి వైరాగ్యం అనేక రకాల అర్థాలను స్ఫురింపజేస్తున్నది. అధికార పార్టీకి చెందిన నాయకుడికి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకోవడానికి కూడా అనుమతులు దొరక్కపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహం లభించడం లేదని, లంచాలు మితిమీరిపోతున్నాయని, ఎవరికి వారు వ్యాపారాలనుంచి పక్కకు తప్పుకుంటున్నారని.. ఈ నాలుగేళ్లలో చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా రుజువులు కూడా ఉన్నాయి. హీరో మోటార్స్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో నెలకొల్పడానికి మంతనాలు జరిగాయి. జగన్ సర్కారు ఏర్పడగానే అది వెనక్కి వెళ్ళింది. పొరుగురాష్ట్రంలో నెలకొల్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా జయదేవ్ వ్యాపార సంస్థ అమరరాజా గ్రూపును ప్రభుత్వం వేధిస్తూ ఉండడంతో రాష్ట్రంలో నెలకొల్పదలుచుకున్న కొత్త ప్రాజెక్టులను వాళ్ళు తెలంగాణకు మార్చుకున్నారు. కొన్ని వేల మందికి దక్కగల ఉపాధి అవకాశాలు తప్పిపోయాయి. ఇలా ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇలా అనేక నే ఆరోపణలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టే వారిని వేధిస్తున్నారని నిందలు ఉన్నాయి.

ఇన్నాళ్లు వాటిని నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎంపీ నే తను అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే కొన్ని నెలలుగా అతీగతీ లేదని వెల్లడిస్తుండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంపీ సత్యనారాయణకు, వైసీపీలో కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మద్య విభేదాలు ఉన్నాయి. వాటికారణంగానే.. ఆయనకు అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్నారనే అనుమానాలు కూడా పలువురు వెలిబుచ్చుతున్నారు. మొత్తానికి ఎంపీ తన వ్యాపారాన్ని మొత్తం హైదరాబాదుకు మార్చేసుకుంటానని, అక్కడ నెలరోజుల్లోనే అనుమతులు వచ్చేస్తున్నాయని చెప్పడం… ప్రజల్లో జగన్ సర్కారు పరువు తీసే వ్యవహారమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles