అధికార వికేంద్రీకరణ అనే మాటల గారడీ ముసుగులో విశాఖకు రాజధాని తరలించడం గురించి, అమరావతి రాజధాని అనే తెలుగు ప్రజల స్వప్నాన్ని ఛిద్రం చేయడం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలినుంచి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అమరావతిని శిథిలభూమిగా మార్చేసి.. విశాఖకు రాజధానిని తీసుకువెళ్లాలనే వారి ప్రయత్నం ఫలించలేదు. రాజధాని రైతుల పోరాటం ఫలితంగా హైకోర్టు అందుకు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానిపై సుప్రీంలో అప్పీలుచేసి ప్రభుత్వం నేడో రేపో తీర్పు వచ్చేస్తుందని చాలాకాలంగా ఎదురుచూస్తూనే ఉంది.
అయితే ఈలోగా వైఎస్సార్ సీపీ మంత్రులు, సీనియర్ నాయకులు ఊరకే ఉండట్లేదు. విశాఖకు రాజధాని వచ్చేస్తున్నదని ఉత్తరాంద్ర ప్రజలను మభ్యపెట్టడానికి రకరకాల ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ‘వచ్చే నెల నుంచి విశాఖ నుండి పాలన’ అనే తరహా ప్రకటనలు ఎంతమంది మంత్రులు ఎన్ని వందల సందర్భాల్లో ఎంతకాలంగా చెబుతూ ఉన్నారో ప్రజలకు తెలుసు. అయితే అవన్నీ ఉత్తుత్తి మాయమాటలే అని అందరికీ అర్థమవుతూనే ఉంది.
మధ్యలో ఉత్తరాంధ్ర ప్రజలను బురిడీ కొట్టించడానికి అన్నట్టుగా ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్లు.. మూడురాజధానులు అన్ని ఉత్తుత్తికే, అసలు రాజధాని విశాఖ మాత్రమే అనే ప్రకటనలు కూడా చేస్తూ వచ్చారు. అయినా.. ‘విశాఖ రాజధాని’ అని తాయిలానికి ఉత్తరాంధ్ర లొంగడం లేదని పట్టభద్ర ఎన్నికలు చాలా స్పష్టంగా నిరూపించాయి. వైసీపీని ఉత్తరాంధ్ర పట్టభద్రులు చాలా అవమానకరంగా ఓడించారు.
అయినా ఇంకా జగన్ ఇంకా వారిని మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. జూన్ జులై నుంచి విశాఖ రాజధానిగా పాలన మొదలవుతుందని గతంలో జగన్ చెప్పారు. కానీ సుప్రీం కోర్టులో పిటిషన్ ఆలోగా తెమిలే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు సెప్టెంబరులో తన కాపురం విశాఖకు మారుస్తానని, అధికార వికేంద్రీకరణలో అది భాగం అని జగన్ అంటున్నారు.
జగన్ తన కాపురాన్ని తాడేపల్లి నుంచి విశాఖకు మార్చినా, బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ కు మార్చినా పెద్ద తేడా ఏం లేదు. సెక్రటేరియేట్ మారితేనే రాజధాని మారినట్టు. ఆయన చెబుతున్న అధికార వికేంద్రీకరణ జరిగినట్టు. అది జరగడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగాలి. అవి తొలగుతాయనే విశ్వాసం జగన్ లో సడలిపోయినట్టుంది. అందుకే ముందు తన కాపురం విశాఖకు మార్చేసి.. ఇదిగో అదిగో రాజధాని వచ్చేస్తున్నదని మాయ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
విశాఖకు కాపురం.. నయా వంచనాత్మక ప్రకటన!
Sunday, December 22, 2024