ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పరువు సంపూర్ణంగా పోయింది. ఇప్పుడిక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో తమ పార్టీ బలానికి సరిపడా రాగల సీట్లను మించి.. ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నింటికీ పోటీ పెట్టారు జగన్. మొత్తం 7 ఖాళీలు ఉంటే.. తన పార్టీ తరఫునే ఏడుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీని గెలవగల స్థాయిలో 23 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదనే అస్తిత్వాన్ని కూడా ఆయన గుర్తించదలచుకోలేదు.
తీరా చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తరఫున విప్ జారీ చేశారు. పార్టీని వదలి పారిపోయిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు ఇప్పుడు వారికి కీలకంగా ఉన్నాయి. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తామని చెబుతుండడంతో.. జగన్ పరిస్థితి సంకటంలో పడ్డట్టు అయింది.
తెలుగుదేశం వాళ్లు విప్ దెబ్బ తప్పించుకోవడానికి మహా అయితే గైర్హాజరు కావొచ్చు. కానీ తన పార్టీ వాళ్లు వచ్చి తెలుగుదేశానికి ఓట్లు వేస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ వారు తన పార్టీని వదలి తెలుగుదేశంలో చేరడానికి బేరం మాట్లాడుకుని ఉన్నవాళ్లే!అలాంటి దుస్ధితి తనకు రాకూడదంటే.. పార్టీ తరఫున విప్ జారీచేయడం ఒక్కటే మార్గం.
అధికార పార్టీలో ఉంటూ .. ఎమ్మెల్యేలో తన కట్టుబాటులో ఉండడం లేదనే భయానికి సంకేతంగా విప్ జారీ చేయడం జగన్మోహన్ రెడ్డికి అవమానకరం. పైగా.. చంద్రబాబునాయుడు విప్ జారీచేసిన తర్వాత.. జగన్ కు భయమేసి, ఆయన మార్గాన్ని కాపీ కొట్టాడని అంతా అంటారు. అలాంటి అపకీర్తి అదనం. అందుకని విప్ జారీ చేయడానికి ఆయనకు పౌరుషం అడ్డొస్తుంది. అలాగని విప్ ఇవ్వకుండా మిన్నకుంటే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటిదాకా తన పార్టీలో బయటపడిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ఇంకా ఎందరు దొంగచాటుగా తెలుగుదేశానికి ఓట్లు వేస్తారో అర్థం కాని సంగతి. ఆ రకంగా విప్ ఇవ్వకపోతే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏడుగురిని మోహరించడం వెనుక జగన్ వ్యూహం ఏమైనా అయి ఉండొచ్చు గానీ.. అది ఏమాత్రం దెబ్బ తిని, తమకున్న బలానికని తగినట్టుగా తెలుగుదేశం ఒక్కస్థానాన్ని గెలుచుకోవడం అంటూ జరిగితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పరువు మరింతగా పోవడం గ్యారంటీ.
విప్ ఇవ్వాలంటే పౌరుషం.. ఇవ్వకుంటే నష్టం!!
Wednesday, January 22, 2025