విపక్ష కూటమిలో ఆప్.. కాంగ్రెసుకు ఇష్టం లేదా?

Wednesday, November 13, 2024

మోడీ సర్కారును గద్దె దించడానికి దేశంలోని భాజపాయేతర విపక్షాలు అన్నింటినీ ఏకతాటిమీదకు తీసుకురావాలని అనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకల్పంలో తొలి అడుగు సవ్యంగానే పడింది. అయితే ఈ తొలి అడుగుతోనే విపక్షాలన్నీ ఐక్యతారాగం ఆలపిస్తున్నట్టుగా అనుకుంటే పొరబాటు. ఈ రోజు విపక్షాలభేటీని తన ఇంట్లో జరుగుతున్న సొంత శుభకార్యంలాగా భావిస్తున్నట్టుగా నితీశ్ కుమార్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అన్ని రాష్ట్రాలు స్వయంగా తిరిగి మరీ వారిని ఆహ్వానించారు. మొత్తానికి 17 విపక్ష పార్టీలు సక్సెస్ ఫుల్ గా భేటీ అయ్యాయి. అయితే దీనిని ఐక్యత అనడానికి వీల్లేదనే సంకేతాలు కూడా తొలి భేటీలోనే వెలువడ్డాయి.

ఢిల్లీ మరియు పంజాబ్ లలో ప్రభుత్వం నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మోడీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్సును కాంగ్రెసు పార్టీ కూడా బహిరంగంగా వ్యతిరేకిస్తే తప్ప.. తాము ఈ కూటమిలో కొనసాగలేం అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. నిజానికి ఈ ఆర్గినెన్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి తేల్చి చెబితే తప్ప.. అసలు పాట్నా భేటీకే హాజరు కాబోం అని కేజ్రీవాల్ నిన్ననే ప్రకటించారు. కానీ ఫైనల్ తమ పార్టీ ఎంపీని పంపారు. ఈ భేటీకి హాజరైన పార్టీల్లో కాంగ్రెస్ మినహా మిగిలిన అందరూ కూడా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకించారు. అయితే కాంగ్రెసు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ.. ఆ టాపిక్ మాట్లాడడానికి ఇది వేదిక కాదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

ప్రస్తుతానికి ఈ విపక్ష కూటమి తర్వాతి భేటీని జులై 10 లేదా 12 తేదీల్లో సిమ్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ భేటీలో దాని గురించి మాట్లాడుకోవచ్చునని కాంగ్రెస్ దాటవేస్తోంది. ఆమ్ ఆద్మీ మాత్రం పట్టు సడలించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ ఆర్డినెన్సును బహిరంగంగా వ్యతిరేకించడం మాత్రమే కాదు, రాజ్యసభలో తమ పార్టీకి ఉన్న 31 మంది ఎంపీల ద్వారా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయిస్తే మాత్రమే తాము కూటమిలో కంటిన్యూ అవుతామని లేదా తమ దారి తాము చూసుకుంటాం అని చెబుతోంది.

ఈ పరిణామాలను గమనిస్తోంటే.. ఢిల్లీలో తమతో శత్రుత్వాన్ని కొనసాగిస్తూ ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిలో ఉండడం కాంగ్రెసుకు ఇష్టం లేదేమో అనే ప్రచారం జరుగుతోంది. ఆప్ ను దూరం పెట్టడానికే, ఆర్డినెన్సును వ్యతిరేకించకుండా కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి లుకలుకలతో ఐక్యత ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వినిపిస్తోంది. మరి సిమ్లా భేటీలోగా కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వస్తుందా.. లేదా కూటమి పురుడుపోసుకోకముందే.. ఒక దెబ్బ పడడానికి తాను స్వయంగా కారణం అవుతుందా గమనించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles