ఛానెల్ పెడతా, పత్రిక పెడతా.. నా మీద వచ్చే విమర్శలు అన్నింటికీ ఆ పత్రికలో సమాధానం ఇస్తా.. అంటూ రెచ్చిపోయి ఏంటేంటో మాట్లాడుతూ ఉండే విజయసాయిరెడ్డి పాపం.. ఇప్పుడు మరోసారి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం వచ్చేలా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా అయిన విజయసాయిరెడ్డి తన అల్లుడి లీలల గురించి ఈసారి ప్రెస్ మీట్ పెడితే మాత్రం.. నోటికి ఏదివస్తే అదిమాట్లాడితే కుదర్దు. ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే.. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఆయన అల్లుడు మోకాళ్లలోతు కూరుకుపోయి ఉన్నారు. మొలలోతు కూరుకుపోవడం ఎంతో దూరంలో లేదు. పీకల్లోతు ఇరుక్కుపోయి అరెస్టు అయినా ఆశ్చర్యం లేదు. అన్నింటికంటె పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఏపీలో మద్యం వ్యాపారానికి ఉన్న అక్రమ లింకులు అన్నీ బయటకు వచ్చి.. అవి స్వయంగా విజయసాయి మెడకు చుట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అందుకే.. ఏదో విశాఖ భూముల విషయంలో మాదిరిగా రెచ్చిపోయి మాట్లాడితే కుదరదు.
విశాఖపట్నం దసపల్లా భూముల్ని అడ్డగోలుగా పొందడం గురించి విజయసాయిరెడ్డి పాత్రపై దీర్ఘకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఆయన ఆరోపణలపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. నా కూతురును అరబిందో వంటి పెద్ద సంస్థలో ఇచ్చి పెళ్లి చేశాను. ఆ సంస్థకు అనేక వ్యాపారాలున్నాయి. ఆ సంస్థ భూములు కొంటే అవి నావి అవుతాయా? అంటూ లాజిక్కులు మాట్లాడారు. నైతికంగా తప్పు జరిగిందా లేదా అనే సంగతి ఆయన పట్టించుకోవడం లేదు. లీగల్ గా తప్పుతో నాకు సంబంధం లేదు కదా.. అని మాత్రమే చెబుతూ వచ్చారు. బినామీల పేరు మీద నడిపించే అక్రమ లావాదేవీలు కూడా.. చట్టం- న్యాయం పరిధినుంచి తప్పించుకోజాలవు అనే సంగతిని ఆయన కన్వీనియెంట్ గా విస్మరిస్తూ వచ్చారు.
ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సోదరుడు, అరబిందో గ్రూపునకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా అరెస్టు అయ్యారు. అయితే.. ఈ కుంభకెోణంలో రోహిత్ రెడ్డికి చెందిన సంస్థకే ఎక్కువ ప్రమేయం ఉన్నట్లుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇవి ఢిల్లీ మద్యం వద్దనే ఆగేలా కనిపించడం లేదు. ఏపీలో మద్యం వ్యాపారంలో జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. మారిన విధానం, జరిగిన అక్రమాలతో కూడా సంబంధాలు బయటకు వస్తున్నాయి. ఈడీ మరింత లోతుగా విచారణ సాగించడంలో.. విజయసాయి అల్లుడి పాత్ర మాత్రమే కాదు.. విజయసాయి పాత్ర కూడా బయటకు వస్తుంది. అప్పుడిక ఈ ట్విటర్ హీరో.. తన ట్వీట్లలో చెప్పుకోడానికి ఏమీ ఉండకపోవచ్చు.
ఢిల్లీలో భాజపా పెద్దలను ఎప్పుడు కలిసినా సరే.. అతి విధేయత, వారి పట్ల అతి భక్తి ప్రదర్శిస్తూ ఉండే ఈ వైసీపీ నాయకుడికి.. త్వరలోనే.. వారితో గల సంబంధ బాంధవ్యాలను పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో అని పలువురు అంచనా వేస్తున్నారు.