ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనం మీద ప్రేమాభిమానాలు వెల్లువెత్తుతున్నాయి. వారికి చిన్న కష్టం వచ్చినా ఆయన చూడలేరు. వారి కష్టాలకు తను కారణం కాకూడదని మనస్ఫూర్తిగా తలపోస్తుంటారు. అందుకే తాను ఏ నగరానికైనా పర్యటనకు వెళుతున్నప్పుడు.. తన టూరు వలన స్థానిక ప్రజలకు ఏ కష్టమూ రాకుండా.. రోడ్లమీద జనసంచారాన్ని అప్రకటితంగా నిషేధిస్తారు. రోడ్ల పక్కన బారికేడ్లు వేయించి, దుకాణాలను కూడా మూయిస్తారు. రోడ్ల మీద అసలు ట్రాఫిక్ తిరగకుండా నిషేదించేస్తారు. పాపం.. తన వల్ల వారికి ఏ ఇబ్బందీ రాకూడదని ఆయన అనుకుంటారు.
ఎంతో విశాల హృదయుడు, దయామయుడు అయిన ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతోనే ఉన్నారు. తన మీద జరిగిన కోడికత్తి దాడికేసుకు సంబంధించి.. విచారణకు రావాలని కోర్టు పిలిస్తే.. తాను స్వయంగా రావడం వలన ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో కదా అని ఆయన దురపిల్లుతున్నారు. ఆవేదన చెందుతున్నారు. అందుకే ‘నేను రాలేను గానీ.. అడ్వకేట్ కమిషనర్ ద్వారా నా సాక్ష్యాన్ని నమోదు చేసుకోండి’ అని కోర్టుకు మార్గనిర్దేశనం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద జరిగిన కోడికత్తి దాడికేసు విచారణ ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. కేసు విచారణ పూర్తి కావడానికి, దాడికి గురైన జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరు కావాలని కోర్టు గత వాయిదాలోనే ఆదేశించింది. తాజా గా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తనకు అనేక బాధ్యతలు ఉంటాయని, పేదలకు అందించే సంక్షేమ పథకాల గురించి సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. తద్వారా తనకు కోర్టుకు హాజరు కావడానికి ఖాళీ లేదని ఆయన తెలియజేసినట్లయింది. ‘కోర్టుకు సీఎం హాజరైతే భద్రతకోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని ప్రజల మీద జగన్ తన పిటిషన్లో సానుభూతి చూపించడం విశేషం.
ఇదే సమయంలో కోడికత్తి దాడి కేసును త్వరగా, మరింత లోతుగా విచారణ పూర్తిచేయాలని కోరుతూ మరో పిటిషన్ కూడా జగన్ దాఖలు చేయడం గమనార్హం. ట్రాఫిక్ సమస్యలు వస్తాయి గనుక తాను కోర్టుకు రాను అని జగన్ పిటిషన్ వేయడం చాలా కామెడీగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ లెక్కన సీఎం అనే వ్యక్తి ఏ నగరంలోనూ ఏ కార్యక్రమానికి రోడ్డుమీద ప్రయాణం చేయకుండా బతకాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అతి కొద్ది దూరాలకు కూడా హెలికాప్టర్లో వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, పాదయాత్ర చేస్తున్న రోజుల్లో శుక్రవారాలు సాగే సీబీఐ విచారణలకు హెలికాప్టర్లో రావడం అలవాటే గనుక.. తన మీద జరిగిన దాడికేసు విచారణే కాబట్టి.. జగన్ హెలికాప్టర్లో ఎన్ఐఏ కోర్టు దాకా వెళ్లి.. విచారణ పూర్తి కావడానికి వారికి సహకరించవచ్చు కదా.. అని కూడా ప్రజలు అనుకుంటున్నారు.
విచారణ ఎగ్గొట్టడానికి జగనన్న కొత్త సాకులు!
Wednesday, January 22, 2025