తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించడానికి కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా భీషణమైన ప్రతిజ్ఞలు చేస్తున్నాయి. అందరికీ అధికారం కావాలి. కేసీఆర్ సర్కారు రెండు దఫాలు విజయం సాధించింది గనుక.. ఎంతో కొంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని ఉంటుంది గనుక.. ఆ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోగలిగితే. తామే గద్దె ఎక్కుతామరని ఎవరికి వారు ఆశపడుతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా.. నాగర్ కర్నూలులో జెపి నడ్డా ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ కూడా జరిగింది. అయితే ఆ సభలో నడ్డా మాటలు గమనిస్తే.. ఇలాంటి పోకడలతో వీరు ప్రజలను ఆకట్టుకోవడం సాధ్యమేనా? అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పైగా కాంగ్రెస్ వేస్తున్న నిందలనే బిజెపి కూడా వేసేట్లయితే కొత్తగా ఆ పార్టీని తాము ఎందుకు ఆదరించాలనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
తెలంగాణలోని కేసీఆర్ సర్కారు భూరికార్డులు నిర్వహించేందుకు ధరణి అనే పోర్టల్ ను ఉపయోగిస్తోంది. ఆ ధరణి పోర్టల్ వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మరోవైపు భారాస మాత్రం ధరణి పోర్టల్ ను సమర్థించుకుంటూనే ఉంది.
ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వెర్సస్ భారాస రాజకీయం కొన్ని నెలలుగా ధరణి పోర్టల్ మీదనే సాగుతోంది. తాము గెలిస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు ఏ మూల ఓ సమావేశం నిర్వహించినా ఖచ్చితంగా ధరణి గురించే మాట్లాడుతున్నారు. ధరణి అక్రమాల గురించే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ కూడా.. ధరణిని వెనకేసుకొస్తూ.. ధరణిని కాదు, దానిని బంగాళాఖాతంలో కలిపేస్తాం అనేవాళ్లనే.. బంగాళాఖాతంలో కలిపేయాలని దాదాపుగా ప్రతి సమావేశంలోనూ కాంగ్రెసు మీదనే విరుచుకుపడుతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య ‘ధరణి వార్’ నడుస్తోంది.
ఇప్పుడు జెపి నడ్డా సభతో తమ సెకండిన్నింగ్స్ దాడులు ప్రారంభించింది బిజెపి. ఆల్రెడీ వాయిదా పడిన అమిత్ షా సభ మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నడ్డా తన ప్రసంగంలో.. కాంగ్రెస్ వారి బాటనే అనుసరించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ (దాని పేరు కూడా ఆయనకు సరిగా తెలియదు పాపం) ను రద్దు చేస్తామని ఆయన చెబుతున్నారు. అచ్చంగా కాంగ్రెస్ చెబుతున్న పనులు చేసేట్లయితే.. ప్రజలు మళ్లీ బిజెపిని ఎందుకు ఎంచుకోవాలి? కాంగ్రెసుకే ఓట్లు వేస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల విమర్శ. భారాస, కాంగ్రెస్ ల కంటె తాము మెరుగైన పని ఏమైనా చేయగలమని నిరూపించుకుంటే తప్ప.. బిజెపిని ప్రత్యేకంగా ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఆ పార్టీ నాయకులు ఈ ఆలోచన చేస్తున్నట్టు లేదు.