వాళ్లు అలిగారా.. పురిట్లోనే సంధి కొడుతుందా?

Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీతో కలిసి 26 ప్రతిపక్ష పార్టీలు ఒక జట్టు కట్టాయి. నినాదాలకు అనుకూలంగా ఉండేలాగా వీరంతా కలిసి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ మాత్రం వీరి ఐక్యత గురించి సందేహాలు లేవనెత్తుతున్నారు. మోడీ సందేహాలే నిజమౌతాయా? అన్నట్లుగా.. బీహార్ కు చెందిన నేతలు కొత్త కూటమి ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొనకుండా వెళ్లిపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
బిజెపియేతర పార్టీల ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఆయన కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగి మరీ.. పార్టీలను ఒక్కతాటిమీదకు తీసుకువచ్చారు. మొత్తానికి 26 పార్టీలు ఒక టీంగా ఏర్పడ్డాయి. ఈ టీంకు సారథి ఎవరు అనేది మాత్రం ఇంకానిర్ణయం కాలేదు. ప్రస్తుతానికి 11మందితో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ముంబాయిలో జరిగే మూడో సమావేశంలో కూటమి కన్వీనర్ ను కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో యూపీఏ కు సోనియా సారథి. ఇప్పుడు కన్వీనర్ మారే అవకాశం ఉంది.
అయితే ఇండియా కన్వీనర్ గా తన పేరును ప్రకటించనందువల్లనే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అలిగి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొనకుండా వెళ్లిపోయారని ఒకప్రచారం ఇప్పుడు ప్రారంభం అయింది. బిజెపి నాయకుడు సుశీల్ మోడీ మాట్లాడుతూ.. ‘‘తనను కన్వీనర్ చేస్తారని నితీశ్ ఎంతగానో ఆశపడ్డారు. అలా జరగకపోవడంతో అలిగి వెళ్లిపోయారని’’ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బిజెపి మాటలను ఆయన కొట్టి పారేస్తూనే తిరుగు ప్రయాణం షెడ్యూలు ముందే ఖరారు కావడం వలన.. కొందరు నాయకులు ప్రెస్ మీట్ లో ఉండకుండా వెళ్లిపోయారని ఖర్గే వెల్లడించారు. కానీ ఈ మాటలు అంత నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. కూటమి సమావేశం ఎప్పటిదాకా జరుగుతుందో, ఎన్ని గంటలకు ప్రెస్ మీట్ జరుగుతుందో అంతా ముందుగా నిర్ణయమైన విషయాలే. అలాంటిది.. హాజరయ్యే ఖాళీ లేకుండా.. నితీశ్ ఇంకా ముందుగా వేరే కార్యక్రమాలు నిర్ణయించుకున్నారా? అనేది సందేహం. అదే సమయంలో నితీశ్ ఒక్కరే అయితే పర్లేదు.. ఆయనతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వెళ్లిపోయారు. ముగ్గురూ వెళ్లిపోవడంతో అలక గురించి, ఐక్యత గురించి అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.
వీరు అలిగినట్లుగా భావించడానికి కొన్ని కారణాలున్నాయి. నితీశ్ కుమార్ కు ప్రధాని పదవి మీద కన్నుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన అన్ని పార్టీలను ఒక్కతాటిమీదకు తేవడానికి శ్రమించారని అంటుంటారు. ఇండియా కూటమికి కన్వీనర్ అయితే.. అక్కడినుంచి ప్రధాని కావడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన ఆలోచన కావొచ్చు. ఆయన ప్రధాని అయితే ఆటోమేటిగ్గా.. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు! ఇప్పుడు నితీశ్ కు కన్వీనర్ హోదా దక్కకపోతే.. ఈ ముగ్గురి ఆశలు భంగపడినట్టే! ఈ అనుమానాలకు తగ్గట్టుగా ఆ ముగ్గురు మాత్రమే ప్రెస్ మీట్ కు ఉండకుండా వెళ్లిపోయారు. మరి ముంబాయి భేటీ తర్వాతనైనా ఈ అనుమానాలు నివృత్తి అవుతాయేమో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles