ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ ఒక అద్భుతంగా నిలిచిపోతుందని.. ఈ సినిమాని ప్రకటించినప్పుడు అందరూ అనుకున్నారు. సినిమా ఏకొంచెం పద్ధతిగా తయారై ఉన్నాసరే అదే జరిగేది. కానీ ఈ చిత్రం అన్ని రకాలుగానూ అన్ని వర్గాలనూ నిరాశపరిచే చిత్రంగా రూపొందింది. రామభక్తులంతా దీనిని విచ్చలవిడిగా తిట్టిపోస్తుండడం వేరే సంగతి.. చివరికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చిత్రాన్ని అసహ్యించుకుంటున్నారు. పబ్లిసిటీ పేరుతో నడిపించే డ్రామాలు ఓపెనింగ్ కలెక్షన్స్ ను ప్రభావితం చేస్తాయి గానీ.. సినిమా ఎంత కాలం రన్ అవుతుందనేది సందేహమే. ఇలాంటి నేపథ్యంలో సంభాషణల మీద కూడా రచ్చ రచ్చ అవుతోంది.
రాముడికి పరుచూరి బ్రదర్స్ మార్కు గల మాస్ పంచ్ డైలాగులు పెట్టడం ఒక రకంగా రచ్చ అవుతోంది. మరోవైపు హనుమంతుడి సంభాషణల మీద ఇంకా జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేకించి.. ఇంద్రజిత్తు తన తోకకు నిప్పు పెట్టిన తర్వాత.. హనుమంతుడు అతనితో ‘‘నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది.. దానికి రాసిన చమురు నీ బాబుది.. నిప్పు కూడా నీ బాబుకే’’ అనే డైలాగు ఉంటుంది. హనుమంతుడితో అలాంటి పంచ్ డైలాగులు పలికించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే.. రామాయణంలో మాత్రమే కాదు.. మన పురాణాలు అన్నింటినీ గమనించినా కూడా.. ఎదుటివారిని నొప్పించకుండా చాలా లలితంగా మాట్లాడే పాత్రగా హనుమంతుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాముడితో కలిసి పరిచయం చేసుకునే తొలి సందర్భంలో గానీ, సీతమ్మ దగ్గరికెళ్లి రాముడి ఉనికిని తెలియజెప్పే సందర్భంలో గానీ రాముడి సంభాషణా చాతుర్యం అనేది గొప్పగా బయటపడుతుంది. హనుమంతుడు అంటేనే చాలా మర్యాద నిండిని మాటతీరుకు ప్రతీక. ఇలాంటి వాస్తవాలేమీ తెలియకుండా.. ఒక ఫ్యాక్షన్ మాస్ లీడర్ యొక్క కుడి భుజం అనుచరుడికి రాసినట్టుగా ఇలాంటి చిల్లర మాస్ డైలాగులు రాయడం ఘోరం.
అయితే రైటర్ మనోజ్ ముంతషీర్ రామ భక్తులకు, రామాయణం గొప్పతనం తెలిసిన వారికి, సారీ చెప్పడానికి బదులు, ఈ రకం మాటలను సమర్థించుకుంటున్నారు. పాత్రల్ని బట్టి డైలాగులు ఉంటాయి కదా అంటున్నారు. మనందరికీ రామాయణం మన అమ్మమ్మలో నానమ్మలో చెబితేనే తెలిసింది. నాకు వారు ఇలాగే చెప్పారు. నేను అలాగే రాశాను అని సమర్థించుకుంటున్నారు.
అలాంటప్పుడు ఆదిపురుష్ సినిమాను వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమాగా చెప్పుకోవడం ఎందుకు.. మనోజ్ ముంతషీర్ యొక్క అమ్మమ్మ చెప్పిన రామాయణంగా సినిమా ఓపెనింగ్ లో ఒక టైటిల్ కార్డు వేసి ఉంటే సరిపోయేది కదా.. అని ఇప్పుడు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.
వాల్మీకిది కాదిది.. మనోజ్ అమ్మమ్మ గారి రామాయణం!
Sunday, January 19, 2025