వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఓ అద్భుతమైన యంత్రాంగాన్ని తీసుకువచ్చాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. వైసీపీ నాయకులంతా ఈ మాటలకు అనుకూలంగా భజన చేస్తుంటారు. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ రూపంలో జరుగుతున్న దారుణాలను దుర్మార్గాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుండగా.. ఆ విధానం మీద రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ కూడా వాలంటీర్లందరూ తనకు తమ్ముళ్లు, చెల్లెళ్లు అవుతారని అంటూనే.. వారిని నేను తానేమీ నిందించలేదని, వారిని అడ్డు పెట్టుకుని, వారి ముసుగులో సాగించే అరాచకాలనే ప్రశ్నిస్తున్నానని అంటున్నారు.
ఈ వాలంటీరు వ్యవస్థ గురించి ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. వాలంటీరు వ్యవస్థలోని అసలు బండారాన్ని ఆయన బయటపెట్టేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక గ్రామంలోకి ప్రవేశించండి- అక్కడ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరు అని అడిగితే ప్రజలకు తెలియకపోవచ్చు… సర్పంచ్ ఎవరు అంటే వారు చెప్పలేకపోవచ్చు.. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరు అన్నా కూడా వారు నిర్దిష్టంగా చెప్పలేకపోవచ్చు… కానీ వాలంటీర్ ఎవరు అంటే మాత్రం టక్కున వారికేసి, వారి నివాసం చేసి చూపిస్తారు’’ అని తోట చెప్పుకొచ్చారు. గ్రామాలలో వాలంటీరు వ్యవస్థ అంత పాపులర్ గా సేవలందిస్తున్నదని ఆయన సమర్థించుకున్నారు.
నిజానికి విపక్షాలు మాత్రమే కాదు.. తటస్థులు, ఆలోచనా పరులు కూడా ఈ వ్యవస్థ గురించి వెల్లడిస్తున్న భయాలు అవే. ‘వాలంటీరు వ్యవస్థ అనేది అధికారికంగా ప్రభుత్వ యంత్రాంగం కాకపోయినప్పటికీ.. రాజ్యాంగబద్ధమైన పంచాయతీ రాజ్ వ్యవస్థకు సమాంతరమైన పాలన వ్యవస్థగా మారిపోతున్నది’ అనే భయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు వచ్చిన తర్వాత.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి వారికి ఏమాత్రం విలువ లేకుండా పోతున్నదనే అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలు కూడా అదే మాట అంటున్నాయి.
ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి పార్టీ కార్యకర్తలతో సమాంతర వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసుకున్నారని, ఆ వ్యవస్థకోసం ప్రభుత్వం సొమ్మును గౌరవవేతనాలుగా చెల్లిస్తున్నారని ఆయన విమర్శలున్నాయి. వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే అనే విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. పార్టీ ఎమ్మెల్యేల దగ్గరినుంచి, మంత్రులు, ముఖ్యమంత్రి, పార్టీ నేతలు పలువురు అనేక సందర్భాల్లో ఈ మాట చెబుతూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు తోట త్రిమూర్తులు మాటల్లో ఈ వాలంటీర్లు పంచాయతీరాజ్ వ్యవస్థను తొక్కేస్తున్న సమాంతర వ్యవస్థ అనేది కూడా తెలిసిపోతోంది.