వాలంటీర్ల విషయంలో వైసీపీ నేతల బరితెగింపు!

Thursday, November 14, 2024

గ్రామాల్లో పనిచేస్తూ ఉండే వాలంటీర్లు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ స్థానికంగా సంక్షేమ పథకాల అమలులో పనిచేస్తుంటారు. కానీ ఈ యంత్రాంగాన్ని పార్టీ యంత్రాగంలాగా వాడుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. వారితో ‘ఫ్యాను గుర్తుకే ఓటేయండి’ అనే పదం చెప్పించడం ఒక్కటే తక్కువ.. తతిమ్మా అన్ని రకాలుగా ఎన్నికల ప్రచారం చేయిస్తోంది.
వాలంటీర్లతో ఎక్కడ వైసిపి నాయకులు సమావేశం నిర్వహించినా సరే వారిని ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి మరింత బాగా తీసుకు వెళ్లాలని అడగడంతో ఆగడం లేదు. ఈ ప్రభుత్వ పథకాలన్నీ మీకు జగనన్న మాత్రమే ఇస్తున్నారు, జగనన్న అధికారంలో లేకపోతే ఈ పథకాలు ఏవీ మీకు అందవు, మీకు డబ్బు రావు.. అని కూడా అదే వాలంటీర్లతో లబ్ధిదారులకు చెప్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత వాలంటీర్లదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి చోట పదేపదే వారికి పురెక్కిస్తున్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం 5వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెంచే ఆలోచనతో ఉన్నారంటూ ప్రలోభ పెడుతున్నారు. ఇవన్నీ కూడా గ్రామాలు క్షేత్రస్థాయిలో ఉండే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిత్యం టచ్ లో ఉండే వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకోవడానికి మాత్రమే.
ప్రభుత్వ వేతనం తీసుకుంటూ పనిచేస్తున్న వారిని ప్రభుత్వ సేవకులుగానే చూడాల్సి ఉండగా.. సాక్షాత్తూ రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్లు సైతం.. వాలంటీర్లు అంటే మన పార్టీ కార్యకర్తలే అని మాట్లాడడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి తినడానికి సరుకులు ఇచ్చిన వాళ్లు మన పార్టీ కార్యకర్తలే అంటూ వాలంటీర్లను ఉద్దేశించి మంత్రి ధర్మాన మాట్లాడడం విశేషం. డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి లాంటి వాళ్లు కూడా.. ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలిచేలా చూసే బాధ్యత వాలంటీర్లదే అని వాళ్లకు రాజకీయ ప్రేరణ ఇస్తుండడం జరుగుతోంది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
వాలంటీర్ వ్యవస్థను అడ్డగోలుగా పార్టీ పనులకోసం వాడుకుంటూ.. పార్టీ ప్రచారానికి వాడుకుంటూ సర్కారు ఖజానానుంచి వారికి జీతాలు చెల్లిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ చెలరేగిపోతున్నది. మరి ఈ పోకడలకు ప్రజలు ఎలా చెక్ పెడతారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles