జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ప్రారంభించినా సరే, గ్రామీణ వ్యవస్థలో ఇవాళ వాలంటీర్లు అనేది చాలా కీలకమైన భాగంగా మారిన సంగతి అందరూ ఒప్పుకొని తీరాలి. అయితే వాలంటీర్లుగా కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్రమే నియమిస్తూ, వారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాలనే ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహిస్తూ అధికార పార్టీ ఆ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది. ‘జగనన్నను మళ్లీ గెలిపించడం అనేది వాలంటీర్ల బాధ్యత’ అని ఎమ్మెల్యేలు మంత్రులు వారితో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ పదేపదే చెబుతూ వస్తున్నారు. వాలంటీర్లలో జగన్ మీద భక్తి విత్తనాలని నాటడమే కాదు.. చంద్రబాబు నాయుడు పట్ల భయాన్ని విద్వేషాన్ని రేకెత్తించడంలో కూడా వైఎస్ఆర్సిపి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది.
అందులో భాగంగానే ‘‘చంద్రబాబు నాయుడు గనుక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు’’ అనే ప్రచారాన్ని వారు ప్రధానంగా నమ్ముకున్నారు. ఆ రకంగా చంద్రబాబు అంటే వాలంటీర్లలో భయాన్నిరేకెత్తించి, వారు వీలైనంతవరకు ఆయనను ఓడించడానికి క్షేత్రస్థాయిలో పనిచేసేలా పురిగొల్పాలి అనేది అధికార పార్టీ ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు.
‘‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదు’’ అనే సంగతి ఆయన తేల్చి చెప్పారు. తద్వారా ఆ వ్యవస్థలోని వారి భయాలను పోగొట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించకపోవచ్చు గాని ఆ రంగంలో సంస్కరణలు తీసుకువస్తారన్నది మాత్రం నిజం. ప్రజలకు సేవ చేయడమనే తను ప్రాథమిక బాధ్యతను మరిచిపోయి అడ్డగోలుగా వైసిపి నాయకులతో ఈ వ్యవస్థను మొత్తం నింపేశారు. వాలంటీర్లను ఎవరైనా కించిత్తు మాట అంటే చాలు వారి అవినీతిని ప్రస్తావిస్తే చాలు.. ఇక విరుచుకు పడిపోవడం అనేది వాలంటీర్లకు చాలా సహజంగా మారిపోయింది. ‘తమ వ్యవస్థను నిందించవద్దు’ అనడం మాత్రమే కాకుండా ‘అమీతుమీ తేల్చుకుందాం’ అనే స్థాయిలో వాలంటీర్లు రాజకీయ డైలాగులు సంధించడం కూడా చాలా మామూలు వ్యవహారం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేలాగా వాలంటీర్ల వ్యవస్థలో టీడీపీ సర్కారు కీలకమైన అనేక మార్పులు చేస్తుందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.