జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చాలా ముందుచూపుతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఆ ముందు చూపు అనేది.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సవ్యంగా అమలు చేయడానికి, ప్రజలకు నిత్యం ప్రభుత్వ ప్రతినిధిగా టచ్ లో ఉండడానికి వారి మేలుకోసం పనిచేయడానికి అని అందరూ అనుకున్నారు. ఆ వాలంటీర్ల వ్యవస్థ కూడా కాలక్రమంలో భ్రష్టు పట్టిపోయి వారు అందించే ప్రతి పథకంనుంచి వాటాలను ఆశించడం రివాజుగా మారిపోయింది. వారు ఒకవైపు పార్టీ తరఫున ఏజంట్లుగా, ప్రజల మీద నిఘాకు నియమించిన వేగులుగా పనిచేస్తున్నారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. తాజాగా.. వారిని అసలు ప్రభుత్వ సేవకులుగా కాకుండా పార్టీ కూలీలుగా పరిగణించే పరిస్థితి ఏర్పడిందా అనిపిస్తోంది.
ఈ రోజునుంచి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న పెన్షనును 250 రూపాయలు పెంచుతోంది. పెంచిన పెన్షన్లను ప్రజలకు వాలంటీర్లు అందించబోతున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లను అందించడంతో పాటూ ప్రభుత్వ అనుకూల భావజాలాన్ని వారిలోకి చొప్పించడానికి వారికి ఓరియెంటేషన్ తరగుతులు నిర్వహిస్తున్నట్టుగా పార్టీ నాయకులు, ఎమ్మెుల్యేలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతవరకు అయితే పర్లేదు.. కానీ, వాలంటీర్లను పార్టీ తరఫున పనిచేయవలసిన పెయిడ్ కూలీల్లాగా పరిగణిస్తూ నాయకులు వారికి సూచనలు చేయడం, ఆదేశాలు ఇవ్వడమే తమాషాగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు పెడుతున్న సమావేశానికి ఎవరైనా ఖర్మగాలి గైర్హాజరైతే వారిని వాలంటీరుగా తొలగించేస్తున్నారు. వాలంటీర్లు ఇవాళ్టి నుంచి ఇంకో ఏడాది పాటు పార్టీ ఎలా చెబితే అలా నడుచుకోవాలని, ఏం చెబితే అది చేయాలని హెచ్చరిస్తున్నారు. పార్టీని గెలిపించడానికి వాలంటీర్లు అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఎక్కడ చూసినా నాయకుల వాలంటీర్ల వెంటపడుతూ పనిచేయిస్తున్నారు. ఏదో ప్రభుత్వ పథకాల అమలులో చిన్న పాత్రగా ఉండేలా చిన్న జీతాలకు ఈ పనిలో చేరినందుకు ఇప్పుడు తమను పార్టీ కూలీల్లాగా చాకిరీ చేయిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న క్రమంలో వారిని కలిసి జగనన్న ఈ పథకాలన్నీ చేస్తున్నట్టుగా, జగనన్న స్వయంగా డబ్బు ఇస్తున్నట్టుగా ప్రచారం చేయడానికి పార్టీ కన్వీనర్లను, గృహసారథులను విడిగా నియమించుకుంది. వాలంటీర్లు వారితో కలిసి.. వారి కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తోంది. ఎక్కడో ఒక చోట మంత్రిగారు గడపగడపకు కార్యక్రమంలో వెళ్లి ఓ ముసలమ్మను పెన్షను నీకు ఎవరిస్తున్నారు.. అని అడిగితే.. వాలంటీరు ఇస్తున్నాడుఅని చెప్పిందిట. దానికి ఆయన ఉడికిపోయి.. వాలంటీరు ఇస్తున్నాడని అనుకుంటే ఎలా.. జగనన్న ఇస్తున్నాడని ప్రతి ఒక్కరికీ చెప్పాలి అంటూ ఆగ్రహించడం.. వాలంటీర్ల మీద పార్టీ పెత్తన ధోరణులకు ఒక ప్రతీక మాత్రమే!
వాలంటీర్లు అంటే ప్రభుత్వ సేవకులా? పార్టీ కూలీలా?
Saturday, December 21, 2024